అఖిలేష్ రాహుల్ ను ఇలా దెబ్బతీశారే?

Update: 2018-01-10 17:30 GMT

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తన తప్పు తాను తెలుసుకున్నట్లున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది నెలల క్రితం జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో రెండు పార్టీలూ ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత కూడా తమ పార్టీపై పడిందని అఖిలేష్ భావించినట్లున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో్ పొ్త్తులు పెట్టుకోకుండానే ముందుకు వెళతామని అఖిలేష్ ప్రకటించారు. 2019లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్న సంకేతాలు అఖిలేష్ ఇవ్వడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

అందరినీ ఏకతాటిపైకి తేవాలని....

కేంద్రంలో మోడీ హవాను ఎదుర్కొనాలంటే విపక్షాలన్నీ ఉమ్మడిగా పోరాటం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకు అన్ని పార్టీలనూ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత అన్ని పక్షాలను కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో తృటిలో తప్పిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సంఘటితంగా పోరాడితే లోక్ సభ ఎన్నికల్లో మోడీని ఢీకొట్టవచ్చని రాహుల్ భావిస్తున్నారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకుని వెళ్లాలన్న రాహుల ప్రయత్నానికి అఖిలేష్ గండికొట్టినట్లే కన్పిస్తోంది.

సొంతంగా బరిలోకి దిగి....

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే దెబ్బతిన్నామన్న అఖిలేష్ వ్యాఖ్యలు కూడా హస్తం పార్టీని అయోమయంలో పడేసింది. అత్యధిక లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్ ముందుకు వెళ్లాలన్న ప్లాన్ ఫలించేటట్లు కన్పించలేదు. యూపీలో ఇప్పుడిప్పుడే అధికార బీజేపీపై వ్యతిరేకత పెరుగుతుందని, ఇక్కడ తామే ప్రత్యామ్నాయమని అఖిలేష్ చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కనీస సీట్లు సాధించుకోగలిగితే అఖిలేష్ పై వత్తిడి తగ్గే అవకాశముంది. ఇప్పటికే తండ్రి ములాయం సింగ్ ను, బాబాయి శివపాల్ యాదవ్ ను పక్కన పెట్టి పార్టీని హస్తగతం చేసుకున్న అఖిలేష్ సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటి తిరిగి పార్టీకి పూర్వ వైభవం తేవాలన్నది ఆయన ఆలోచన. కాని అఖిలేష్ ప్రకటనపై రాహుల్ పార్టీ ఒకింత కలవరానికి గురయిందనే చెప్పొచ్చు.

Similar News