అందాల తాజ్ మహల్ రాజకీయాల్లో చిక్కుకుంది. తాజ్ మహల్ నిర్మాణం ఎవరు చేశారన్నది పక్కన పెడితే ప్రపంచంలోని వింతల్లో ఒకటిగా భారతదేశానికి ఖ్యాతి తెచ్చింది. తాజమహల్ అందాలను చూసేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు నిత్యం ఆగ్రాకు వస్తుంటారు. అలాంటి తాజ్ మహల్ ను బీజేపీ నేతలు వివాదాస్పదం చేశారు. తాజ్ మహల్ ను దేశద్రోహులు నిర్మించారని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇటీవలే యూపీ ప్రభుత్వం పర్యటక శాఖ బ్రోచర్లో తాజ్ మహల్ కు చోటు లేకుండా చేసింది. దీనిపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతుండగానే ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యాన్ని పోశాయి. షాజహాన్ తన తండ్రినే నిర్భంధించాడని, షాజహాన్ హిందువులను తుడిచిపెట్టేయాలనుకున్నాడని, అలాంటి వ్యక్తులకు చరిత్రలో స్థానం ఉండకూడదని సంగీత్ సోమ్ వ్యాఖ్యానించారు. గతంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా తాజ్ మహల్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తాజ్ మహల్ కు భారత సంస్కృతితో గాని, వారసత్వంతో గాని సంబంధం లేదన్న యోగి వ్యాఖ్యలను అప్పట్లోనే విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ మండిపడింది. బీజేపీ విధ్వేషాలను రెచ్చగొట్టేందుకు చూస్తుందని ఆరోపించింది.
వెనక్కి తగ్గిన యోగి సర్కార్.....
మరోవైపు తాజ్ మహల్ పై బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం నేత అసదుద్దీన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎర్రకోటను కూడా దేశద్రోహులే నిర్మించారని, మరి ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఎగరేయకుండా ఉంటారా? ఒవైసీ ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతుండటంతో యోగి సర్కార్ కొంత ఇబ్బందుల్లో పడింది. అయితే ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, ప్రభుత్వానికి గాని, పార్టీకి గాని సంబంధం లేదని యూపీ సర్కార్ తరుపున రీటా బహుగుణ తెలిపారు. తాజ్ మహల్ చారిత్రక వారసత్వ కట్టడమేనన్నారు. మొత్తం మీద ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ కు కమలనాధులు రాజకీయ రంగు పులుముతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.