అందరూ కలిస్తే ‘హస్తం’దే హవానా?

Update: 2017-12-23 03:30 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతుంది. గత కొంతకాలంగా సభలు, సమావేశాలతో జిల్లాల్లో హోరెత్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయింది. పార్టీ నేతలు విభేదాలు పక్కన పెట్టి సమైక్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఉప్పు నిప్పులా ఉండే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎవరూ ఉండరు. ఆ పార్టీలోని వారేనన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఆ తప్పిదాలు జరగకుండా సమన్వయంతో ముందుకు వెళ్లి విజయతీరాలకుచేరాలన్నది నేతల లక్ష్యంగా కన్పిస్తోంది.

జిల్లాల వారీగా సభలు...

నిన్న మొన్నటి వరకూ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జిల్లాల వారీగా సభలను ఏర్పాటు చేస్తోంది. మెదక్ జిల్లాలో రాహుల్ సభ అనంతరం నల్లగొండ జిల్లాలోనూ సభను నిర్వహించారు. రెండురోజుల క్రితం మహబూబ్ నగర్ లోనూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ దూరంగా ఉండే జైపాల్ రెడ్డి వంటి నేతలు కూడా సభలకు హాజరవుతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందనే చెప్పాలి.

జనవరిలో రాహుల్ పర్యటన....

ఇక రాహుల్ అధ్యక్షుడు అయిన తర్వాత తొలి పర్యటనను తెలంగాణలోనే జరపాలని మొదట అనుకున్నారు. వరంగల్ సభకు రాహుల్ నుతీసుకొద్దామనుకున్నారు. అయితే గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్న రాహుల్ రాలేకపోయారు. తాజాగా రాహుల్ ను మరోసారి టి.కాంగ్రెస్ నేతలు రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు. వచ్చే నెలలో రాహుల్ టూర్ దాదాపు ఖరారయినట్లే. మేడారం జాతరకు రాహుల్ వస్తారని తెలిసింది. దీంతో వరంగల్ లోగాని, మరో ప్రాంతంలోగాని సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నిరుద్యోగ సమస్య మీదగాని, గిరిజన సమస్యలమీద గాని సభ పెట్టాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. అయితే యువతను ఆకట్టుకోవాలంటే నిరుద్యోగ సమస్య మీదనే సభ పెట్టడం బాగుంటుందని పలువురు సీనియర్లు సూచిస్తున్నారు. దేనిపైనా...ఎక్కడ? అన్నది ఇంకా ఖరారు కాకపోయినా జనవరిలో మాత్రం రాహుల్ పర్యటన దాదాపు ఖరారయినట్లేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం నేతల మధ్య విభేదాలు తొలిగిపోయి జోష్ పెరిగిందనే చెప్పొచ్చు.

Similar News