రేపు జరగనున్న తమిళనాడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉత్కంఠను రేపుతున్నాయి. కావేరీ జల వివాదాలు, పార్టీలో గ్రూపుల గోలతో సమావేశాలు సజావుగా సాగుతాయా? అన్న సందేహం అందరిలోనూ ఉంది. గురువారం నుంచి తమిళనాడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి ప్రత్యేకత ఏంటంటే ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం బడ్జెట్ ను ప్రవేశపెటట్నున్నారు. పన్నీర్ సెల్వం బడ్జెట్ పై ముఖ్యమంత్రి పళనిస్వామి పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. బడ్జెట్ అన్ని వర్గాలకూ అనుకూలంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు.
అటు...ఇటు...మారి...
ఏడాదిలో తమిళనాడులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు విపక్షాలు స్వపక్షాలుగా మారిపోతే, నాటి మిత్రులు నేడు శత్రువులుగా మారారు. ఏడాది క్రితం పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పళనిస్వామికి పూర్తిగా వ్యతిరేకం. ఆయనపై అవిశ్వాసం సమయంలోనూ పళనికి వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం వర్గం ఓటు వేసింది. అదే సమయంలో అప్పుడు పళనిస్వామికి అండగా దినకరన్ వర్గం ఉండేది. కాని ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయింది. దినకరన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తారన్నది వాస్తవం. బడ్జెట్ సమావేశాలను ప్రారంభం రోజే ఇరుకున పెట్టాలన్నది దినరకరన్ వ్యూహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకేలోని కొంత మంది ఎమ్మెల్యేలతో రహస్యంగా దినకరన్ సమావేశమయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకేలో కొంత తత్తరపాటు కన్పిస్తుందనే చెప్పాలి.
పన్నీర్ బడ్జెట్ ఎలా ఉంటుందో?
తమిళనాడులో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే లోక్ సభ ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో ప్రజారంజక బడ్జెట్ ను పన్నీర్ సెల్వం ప్రవేశపెడతారు. అన్ని వర్గాలను లక్ష్యంగానే చేసుకుని బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. పన్నీర్ సెల్వం తనకు ఉన్న అనుభవాన్నంతా బడ్జెట్ లో చూపుతారన్న ధీమాలో ఉంది అధికార అన్నాడీఎంకే పార్టీ. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజే పన్నీర్ సెల్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే విపక్షాలు మాత్రం అధికార పార్టీపై నిప్పులు చెరుగుతన్నాయి. ప్రతిపక్ష డీఎంకేతో పాటు ఇతర పార్టీలు, దినకరన్ తో సహా ప్రభుత్వాన్ని రైతు సమస్యలపై నిలదీయనున్నాయి. మరి రేపు ఏం జరగనుందో చూడాలి.