పాపం పార్టీ పెట్టారు. తనకు నమ్మకమైన...స్నేహితుడిని బీహార్ ముఖ్యమంత్రిగాచేశారు. ఆయన బీజేపీతో చేతులు కలిపారు. అది సహించలేని ఈయన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గళం విప్పి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆయనే శరద్ యాదవ్. శరద్ యాదవ్ ను చూస్తే రాజకీయాల్లో ఇలాంటివి కూడా ఈ వయసులో జరుగుతాయా? అని అనిపించక మానదు. జనతాదళ్ యూను ఏర్పాటు చేసి బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పేనేతల్లో శరద్ యాదవ్ ఒకరు. గతంలో జరిగిన బీహార్ ఎన్నికల్లో సయితం బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడంలో శరద్ యాదవ్ కృషి చేశారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడి బీహార్ లో ఘన విజయం సాధించింది.
అన్నీ అవమానాలే.....
అయితే తర్వాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ కూటమి కొన్నాళ్లపాటు కొనసాగింది. అయితే ఆర్జేడీ అధినేత లాలూ కుటుంబానికి, బీహార్ ముక్యమంత్రి నితీష్ కుమార్ కు వచ్చిన విభేదాల కారణంగా ఆయన రాజీనామా చేసేశారు. కాచక్కూర్చున్న బీజేపీ వెంటనే నితీష్ కు అండగా నిలిచింది. దీంతో బీజేపీ సహకారంతో నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా అందరికీ తెలిసిందే అయినా....ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత శరద్ యాదవ్ కు మాత్రం అవమానాలు ఎదురవుతున్నాయి. న్యాయపోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోర్టును ఆశ్రయించిన జేడీయూ నేత....
బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన ప్రతిపక్షాల ర్యాలీలో శరద్ యాదవ్ పాల్గొనడంతో శరద్ యాదవ్ తో పాటు మరో రాజ్యసభ సభ్యుడు అనన్వర్ అలీలపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు గత డిసెంబరు నెలలో అనర్హత వేటు వేశారు. దీనిపై శరద్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ పూర్తయ్యేంతవరకూ వారిద్దరికీ ఎంపీలకు ఉండే సౌకర్యాలను, వేతనం, అలవెన్సులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే న్యాయస్థానాన్ని ఆదేశాన్ని సవాల్ చేస్తూ అదే పార్టీకి చెందిన రాజ్యసభ నేత రామ్ చంద్రప్రసాద్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారిద్దరూ సమావేశాలకు రానందున అలవెన్సులు, వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పిటీషన్ వేశారు. అయితే కోర్టు మాత్రం ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారు తీసుకున్న వేతనాలు, అలవెన్సులు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేతప్ప వేతనాలు ఆపవద్దని పరోక్షంగా చెప్పింది. అంటే జేడీయూ ఇంకా శరద్ యాదవ్ పై కక్ష పూరితంగానే వ్యవహరిస్తుందని, ఆయనకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమానపరుస్తుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం విశేషం.