జగన్ కంచుకోటలో పాగా వేద్దామనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అది సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. కడప జిల్లా అంటేనే వై.ఎస్. కుంటుంబానికి కంచుకోట. అలాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయి వివేకానందరెడ్డిని ఓడించడం, పులివెందులకు నీరు ఇవ్వడం వంటి వాటితో ఆ జిల్లాలో పార్టీ ఎదుగుతుందని చంద్రబాబు ఆశించారు. అందుకే తనకు అత్యంత నమ్మకమైన, సమర్థుడైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కడప జిల్లా పార్టీ ఇన్ ఛార్జి మంత్రిగా నియమించుకున్నారు.
సోమిరెడ్డి కష్టపడుతున్నా.....
సోమిరెడ్డి ఇప్పటికే నెలలో దాదాపు ఐదారు రోజులు కడప జిల్లాలో పర్యటిస్తూ వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వెళుతున్నారు. అయితే నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీలో నెలకొన్న విభేదాలు సద్దుమణగడం లేదు. ఎంతనచ్చ జెప్పినా ఉపయోగం లేకుండా పోతోంది. చిన్న విషయాలకూ నేతలు పంతానికి పోతుండటంతో అవి పెద్దవిగా మారి పార్టీని దెబ్బతీస్తున్నాయన్న ఆందోళన అగ్రనేతల్లో నెలకొంది.
రాజీనామా చేస్తానంటున్న.....
ఇటీవల దీక్ష సందర్భంగా బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మలు విడివిడిగా దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. తనను తొక్కేస్తున్నారని, అవసరమైతే తాను రాజీనామాకు కూడా వెనకాడబోనని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జయరాములు హెచ్చరించారు. స్థానిక పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేద్దామంటే ఆయన అపాయింట్ మెంట్ దొరకడం లేదు. దీంతో జయరాములు టీడీపీ స్థానిక నేతలతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా సరే... టీడీపీ అభ్యర్థి మాత్రం గెలవనివ్వనని ఆయన సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలను కలవర పరుస్తున్నాయి.
తాడోపేడో తేల్చుకునేందుకు.....
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జయరాములుకు ఫోన్ చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా అక్కడ విభేదాలు సమసిపోలేదన్న విషయాన్ని తాజా సంఘటలను స్పష‌్టం చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గానికి వ్యతిరేకంగా జయరాములు వర్గం ఏకంగా ఒక ర్యాలీనే నిర్వహించడం విశేషం. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని విజయమ్మ వర్గానికి కేటాయించడంపై ఆయన మండిపడుతున్నారు.తనకు తెలియకుండా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ను నియమించడం పై ఎమ్మెల్యే జయరాములు షాక్ తిన్నారు. ఇక తాడోపేడో తేల్చుకోవడానికి జయరాములు సిద్ధమయినట్లు సమాచారం. కడప జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు అధినేత చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.