ఆ ముగ్గురు ఎంపీలు కూడా అవుటేనా ...?

Update: 2018-06-07 03:53 GMT

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చినట్లు పార్టీ ఫిరాయింపుల ఎంపీలు ఇప్పుడు తెగ టెన్షన్ పడే పరిస్థితి దాపురించింది. వైసిపి ఎంపీలు చేసిన రాజీనామాలను తాజాగా స్పీకర్ ఆమోదిస్తారని ప్రచారం సాగడం తెలిసిందే. అయితే వీటితో పాటు తాము గతంలో పార్టీ మారిన ఎంపీలపై ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోనికి తీసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి స్పీకర్ కి విజ్ఞప్తి చేస్తుంది. అదే ఇప్పుడు అటు గోడదూకిన వారిని టిడిపిని ఆందోళనకు గురిచేస్తుంది. బుట్ట రేణుకా, ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత పై వైసిపి చర్యలు తీసుకోమన్న ఎంపీల లిస్ట్ లో వున్నారు. ఐదుగురు ఎంపీల రాజీనామాలు ఆమోదించడంతో బాటు మిగిలిన ముగ్గురి సభ్యత్వాలు రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎపి రాజకీయాలు మరింత హీటెక్కిపోనున్నాయి. వారం రోజుల పాటు విదేశాలకు వెళ్లనున్న స్పీకర్ సుమిత్ర మహాజన్ వైసిపి రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకుంటారన్న మాట స్పీకర్ కార్యాలయ నుంచి ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆమె నిర్ణయం పై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఉండవల్లి సలహా బేఖాతరు ...

అక్రమంగా, అన్యాయంగా , రాజ్యాంగ విరుద్ధంగా ఎపి పునర్విభజన చేశారని దీనిపై పార్లమెంట్లో ప్రశ్నించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ వైసిపి ఎంపీలకు సూచించారు. వైసిపి ఎంపీలు స్పీకర్ ముందు హాజరు కాకుండా వర్షాకాల సమావేశాల్లో నోటిస్ ఇచ్చి చర్చకు పట్టుబట్టాలని ఆయన సూచించారు. ఒక వేళ స్పీకర్ చర్చకు అనుమతి ఇవ్వని పరిస్థితి వస్తే సభ లోనే అందరిముందు రాజీనామా చేసి రావాలని ఆయన కోరారు. ఆనాటి అధర్మాన్ని అధికార టిడిపి ప్రతిపక్ష వైసిపి ప్రశ్నించకపోవడం ఏమిటంటూ ఆయన ఇటీవలే నిలదీశారు. గతంలో ఒక సందర్భంలో ఇందిరాగాంధీని పార్లమెంట్ సభలో అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఆమె సభ్యత్వాన్ని సైతం రద్దు చేయడాన్ని ఉండవల్లి గుర్తు చేశారు. అంతకు ముందు పార్లమెంట్లో తప్పుకు ఆమెను బాధ్యుల్ని చేసి శిక్ష విధించిన చరిత్ర మరిచిపోవొద్దని ఆంధ్రప్రదేశ్ ఇంతటి దుస్థితికి అక్రమ విభజనే కారణమని ఉండవల్లి చెబుతూ వైసిపి ఎంపీలు ఎలాగూ రాజీనామాలు చేసి వెళుతున్నందున లోక్ సభలో చర్చకు చివరి ప్రయత్నం చేసి వెళ్లండని ఇచ్చిన సలహా ఆ పార్టీ పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.

Similar News