వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారం ఈరోజు తేలిపోనుందా? స్పీకర్ వైఎస్సార్ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తారా? లేక పక్కన పెడతారా? ఈరోజు దీనిపై స్పష్టత రానుంది. వైసీపీ ఎంపీల రాజీనామాలపై స్పీకర్ కార్యాలయం ఈరోజు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ ఎంపీల రాజీనామాలను గత రెండు నెలలుగా ఆమోదించక పోవడంపై అనేక అనుమానాలను తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తుంది.
రెండు నెలలవుతున్నా.....
ఏప్రిల్ ఆరోతేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారు. అయితే వారి రాజీనామాలు అంతా డ్రామాయేనని, బీజేపీ, వైసీపీ కుమ్మక్కై ఈ నాటకాలకు తెరతీశారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సంవత్సరం కాలపరిమితి ఉంటే ఉప ఎన్నికలు ఎన్నికల సంఘం జరపదని, ఆ సమయం కోసమే చూస్తూ రాజీనామాలను ఆమోదించడం లేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
టీడీపీ ఎదురుదాడి.....
మరోవైపు వైసీపీ కూడా ఎదురుదాడికి దిగుతోంది. తమ పార్టీకి చెందిన ఎంపీల రాజీనామాలు డ్రామాలయితే... నాలుగేళ్లు బీజేపీతో చేసిన కాపురాన్ని ఏమనాలని ప్రశ్నిస్తోంది. ప్రత్యేక హోదా కోసం తొలినుంచి వైసీపీయే ముందుందని, వైసీపీ వల్లనే చంద్రబాబు ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకున్నారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాజీనామాలు ఇచ్చేశామని, ఆమోదించమని స్పీకర్ ను రెండు సార్లు కలసి విజ్ఞప్తులు చేశామని, ఇంతకంటే ఏం చేయగలమని వారు ప్రశ్నిస్తున్నారు.
విదేశాలకు వెళ్లే ముందే.....
స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈరోజు విదేశాలకు వెళుతున్నారు. విదేశాలకు వెళ్లేముందే వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. రాజీనామాలను ఆమోదిస్తే ప్రత్యేక హోదా సెంటిమెంట్ తో ఎన్నికలు వెళ్లవచ్చన్నది వైసీపీ వ్యూహంగా ఉంది. ఆమోదించకుంటే వైసీపీ ఎంపీల రాజీనామాలన్నీ నాటకాలనేనని ప్రచారం చేయవచ్చని టీడీపీ భావిస్తుంది. మరి స్పీకర్ ఈరోజు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.