ఏపీలో 23 మంది వైసిపి ఎమ్యెల్యేలు చట్టవిరుద్ధంగా తెలుగుదేశం పార్టీలోకి గోడదూకిన కేసులో విచారణ వేగవంతం చేసింది హై కోర్టు. కేసులో ప్రతివాదులైన కేంద్ర ఎన్నికల సంఘానికి, ఎపి స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కి నోటీసులు జారీచేసింది. ఈ కేసులో తమ వాదన కోసం పిటిషన్ ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీసింది కోర్టు. మీరు పిటిషన్ వేయని పక్షంలో తదుపరి విచారణ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. చట్టంలో వున్న నిబంధనలు, గత తీర్పుల ప్రకారం తదుపరి విచారణ చేసేందుకు న్యాయస్థానం సిద్ధం కావడంతో రాజకీయ కలకలం రేగింది.
కోర్టు తీర్పు వస్తే ఇబ్బందేనా ...?
పార్టీ ఫిరాయింపుల చట్టానికి తెలుగు రాష్ట్రాలు దారుణంగా తూట్లు పొడిచాయి. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ టిడిపి ఎమ్యెల్యేలందరిని లాగేసింది. ఇక తెలుగుదేశం అదే రూట్ లో ప్రత్యర్థి పార్టీ వైసిపి ఎమ్యెల్యేలను ప్రలోభాలకు గురిచేసి 23 మందిని లాక్కుంది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఫిరాయింపుల అంశం ముగిసిన అధ్యాయమే అయ్యింది. పార్టీ ఫిరాయించిన వారికి ఏకంగా మంత్రి పదవులు సైతం ఇరు రాష్ట్రాల చంద్రులు కట్టబెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేశారు.
స్పీకర్ నిర్ణయమేంటో...?
వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీ మారివచ్చిన అందులో నలుగురికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టడం వివాదాస్పదమయింది. అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. వారిపై చర్యలు తీసుకునేంత వరకూ తాము అసెంబ్లీలోకి అడుగుపెట్టమనికూడా వైసీపీ తేల్చి చెప్పింది. అయినా ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోలేదు. బాధిత పార్టీలు కోర్టు కి ఎక్కినా నాటి నుంచి నేటి వరకు కేసులు సాగుతూనే వున్నాయి . ఇప్పటికి ఈ కేసులో కదలిక రావడంతో అధికారపార్టీలో కలవరం బయల్దేరింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇప్పటికైనా తన నిర్ణయం తీసుకుంటారో కోర్టు తీర్పు వచ్చే వరకు ఇదే రీతిలో నానుస్తారో చూడాలి.