ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మంతటా నవనిర్మాణ దీక్షలు, సంకల్పాలు చేస్తుంటే ప్రతిపక్ష వైసీపీ మాత్రం దీనికి ప్రతిగా వంచనపై గర్జన దీక్షను ఈరోజు చేస్తోంది. గత నెలలో విశాఖలో చేసిన వంచన దీక్ష తరహాలోనే ఈసారి నెల్లూరు వేదికగా వైసీపీ ఎంచుకుంది. చంద్రబాబు ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను వంచిస్తోందని, అభివృద్ధి చేయకుండా చంద్రబాబు తాను మళ్లీ వస్తేనే డెవెలెప్ మెంట్ జరగుతుందని ప్రజల్లోకి వెళుతూ చెబుతున్న మాటలను దుయ్యబట్టేందుకే ఈ వంచనపై గర్జన దీక్షను నిర్వహిస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.
నాలుగేళ్లుగా మోసం చేస్తూ.....
చంద్రబాబు, మోడీ ప్రభుత్వం మిలాఖత్ అయి నాలుగేళ్లుగా ప్రజలను వంచిస్తూనే ఉందన్నది వైసీపీ ఆరోపణ. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ గత నాలుగేళ్లుగా గొంతు చించుకుంటున్నా పట్టించుకోని చంద్రబాబు ఎన్నికల సమయం వచ్చేసరికి ప్రత్యేక హోదా నినాదం అందుకున్నారని అంటున్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన హోదాను తాకట్టు పెట్టేస్తారని, బాబును నమ్మవద్దంటూ ఈ వంచనపై గర్జన చేస్తున్నారు.
అందరు ఎంపీలు రాజీనామా చేస్తే......
ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలందరూ రాజీనామాలు చేశారని, అదే రోజు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం దెబ్బకు దిగివచ్చేదని వారు అభిప్రాయపడ్డారు. కేంద్రంపై యుద్ధం ప్రకటించానని ఒక పక్క చెబుతూనే చంద్రబాబు తమ ఎంపీల చేత ఎందుకు రాజీనామాలు చేయించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఈరోెజు నెల్లూరు లో జరిగే వంచనదీక్షలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ పాల్గొనాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. అందరూ నల్ల చొక్కాలు ధరించి వంచన దీక్షలో పాల్గొనాలని పార్టీ కోరింది. మొత్తం మీద ఏపీలో వైసీపీ, టీడీపీ పోటా పోటీగా దీక్షలు చేస్తూ ప్రజల మనస్సులను గెలుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.