తూర్పులో వైఎస్ జగన్ అడుగు పెట్టారో లేదో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కించేశారు. ఆయన చారిత్రక వారధి రాజమండ్రి రోడ్ కం రైలు వంతెన వరద గోదావరిలా వచ్చిన జనంతో దాటి కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ చేరుకొని బహిరంగ సభ జరిపిన సంగతి తెలిసిందే. జగన్ రాకతో ఆ ప్రాంతం అంతా అపవిత్రం అయిపోయిందంటూ టిడిపి స్థానిక నేతలు కొత్త కార్యక్రమం నిర్వహించారు. గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ గన్నికృష్ణ , శాప్ డైరెక్టర్ యర్రా వేణుగోపాల రాయుడు నేతృత్వంలో టిడిపి నేతలు ఆ ప్రాంతానికి చేరుకొని పసుపునీళ్లు చల్లారు. సాంబ్రాణి పొగ పెట్టారు. అనంతరం తమ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి జగన్ విమర్శలపై విరుచుకుపడ్డారు.
అంగీకరించిన తమ్ముళ్ళు...
వైసిపి అధినేత జగన్ పాదయాత్రతో రోడ్ కం రైలు వంతెన వూగిసలాడిన విషయాన్నీ టిడిపి నేతలు అంగీకరించారు. అయితే ఆ జనాన్ని ఐదు వందలరూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి తెచ్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటుకు టిడిపి నుంచి 5000 లు గుంజేయాలని జగన్ పేర్కొనడాన్ని గుర్తు చేస్తూ ఆయన యాత్రలో పాల్గొనే వారు 500 లకు బదులు 5000 డిమాండ్ చేయాలని సూచించారు. ఇలా జగన్ విమర్శలు ఆరోపణలకు మాటకు మాట చెప్పేసిన తమ్ముళ్ళు వైసిపి అధినేత ఇసుక మాఫియా గా టిడిపి నేతలను పేర్లతో సహా ప్రస్తావించినా దీనిపై మాత్రం ఎవరు నోరు మెదపకపోవడం విశేషం. ఇక పసుపు నీళ్ళు పాలాభిషేకం హడావిడి పై మాత్రం సర్వత్రా చర్చ మొదలైంది. రాజకీయాల్లో ఎవరు పవిత్రులని మరొకరిని అపవిత్రులంటూ ఆరోపిస్తున్నారన్న టాక్ నడవడం విశేషం.