ఇంకెప్పుడు రాజా.. సమయం ఇదే కదా?

జగన్ నామినేటెడ్ పదవులు కొన్ని భర్తీ చేశారు. కొందరికి హామీ ఇచ్చి మాత్రం ఇంకా పట్టించుకోకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.

Update: 2022-10-04 05:37 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా పద్దెనిమిది నెలలు మాత్రమే సమయం ఉంది. 2024లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. కానీ కొందరికి హామీ ఇచ్చి మాత్రం ఇంకా పట్టించుకోకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి కాని ఉత్తర్వులు మాత్రం వెలువడటం లేదు. అయితే సమయం పెద్దగా లేకపోవడంతో ఇప్పుడు పదవులు ఇచ్చినా ప్రయోజనం లేదన్న అభిప్రాయం పార్టీలోనే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన వారికి జగన్ ఎటువంటి పదవులు ఇంతవరకూ ఇవ్వలేదు. గతంలో ఇచ్చినా అది వారి వ్యవహారశైలి కారణంగానే పోగొట్టుకోవాల్సి వచ్చింది.

ఆయనకిచ్చినా....
వైసీపీ అధికారంలోకి రాగానే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఆయన ఆరోపణలు రావడంతో ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి సినిమా వాళ్లకు పదవులు అంటేనే జగన్ భయపడిపోతున్నట్లుంది. లేకుంటే వీరి వల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావించి ఉండవచ్చు. నిజానికి వైసీపీకి మద్దతిచ్చే సినిమా వాళ్లే తక్కువ. ఒకరోఇద్దరో జగన్ కు గత ఎన్నికలకు ముందు, తర్వాత మద్దతిస్తూ వచ్చారు. వారిలో మోహన్ బాబు కూడా ఉన్నారు. అయితే మోహన్ బాబుకు ఎలాంటి పదవి ఇవ్వకపోగా ఆయన కుటుంబాన్ని జగన్ పట్టించుకోవడం మానేశారన్న విమర్శలున్నాయి.
ఆలీకి ఆ పదవి....
ఇక హాస్యనటుడు ఆలికి రాజ్యసభ పదవి దక్కుతుందని తొలినాళ్లలో ప్రచారం జరిగింది. సినిమా కోటాతో పాటు మైనారిటీ కింద ఆలీకి ఆ పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆలీకి రాజ్యసభ పదవి దక్కలేదు. పైగా తన వద్దకు పిలిపించుకుని జగన్ మాట్లాడారు. దీంతో ఏదో ఒక పదవి దక్కుతుందనుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అవి కూడా వార్తలుగానే మిగిలిపోయాయి. ఉత్తర్వులు మాత్రం ఇంతవరకూ వెలువడలేదు. దీంతో ఆలీ పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఆలీ మాత్రం తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
పోసానిని మరిచారా?
ఇక మరో సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. గట్టిగా వైసీపీ వాయిస్ వినిపించే వ్యక్తి. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా కూడా విరుచుకుపడి రచ్చ చేసుకున్నాడు. పోసానికి కూడా జగన్ నామినేటెడ్ పదవి ఇస్తారని భావించారు. ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ పోసానికి కూడా జీవో అందలేదు. అందుకేనేమో పోసాని ఇటీవల కాలంలో మౌనంగా ఉంటూ వస్తున్నారు. పోసాని, ఆలీలు మాత్రమే ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నారనుకోవాలి. వారికి కూడా ఇంతవరకూ నామినేటెడ్ పదవులు దక్కలేదు. సమయం దగ్గరపడుతుంది. ఇంకెప్పుడు రాజా అంటూ పోసాని కాలర్ ఎగరేస్తూ ప్రశ్నించినా ఫలితం మాత్రం కన్పించడం లేదు.


Tags:    

Similar News