యోగి ఇచ్చిన చెక్ చెల్లలేదే...!

Update: 2018-06-10 04:49 GMT

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఇచ్చిన చెక్ కే దిక్కులేకుండా పోయింది. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడమేంటన్న ఆందోళన అధికారుల్లోనూ నెలకొంది. వివరాల్లోకి వెళితే.... ఉత్తరప్రదేశ్ లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో రాష్ట్రంలో ఏడో ర్యాంకు వచ్చిన అలోక్ మిశ్రా ప్రతిభను ప్రభుత్వం గుర్తించింది.

ప్రతిభను గుర్తించి.....

అలోక్ మిశ్రాను యూపీ సర్కార్ అభినందించడమే కాకుండా ప్రతిభ చూపిన విద్యార్థులను నగదు పురస్కారంతో సత్కరించాలని భావించింది. ఈ మేరకు లక్నోలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఏడో ర్యాంకు వచ్చిన అలోక్ మిశ్రాకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ తన చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును అందించారు. దీంతో ఆనందపడిన అలోక్ మిశ్రా ఆ చెక్కును దేనా బ్యాంకులో వేశారు.

సంతకంలో తేడా ఉండటంతో......

అయితే అలోక్ మిశ్రాకు ఊహించని షాక్ తగిలింది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్ ఇచ్చిన (974926) చెక్ బౌన్స్ అయినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. అంతేకాదు అలోక్ మిశ్రాకు హజ్రత్ గంజ్ దేనా బ్యాంకు అధికారులు పెనాల్టీ కూడా వేశారు. అయితే ఇందులో సాంకేతిక లోపం వల్లనే చెక్ బౌన్స్ అయిందని చెబుతున్నారు. బారబంకి జిల్లాకు చెందిన విద్యాశాఖాధికారి రాజ్ కుమార్ యాదవ్ చెక్ పై సంతకం చేశారు. ఆ సంతకంలో వ్యత్యాసం ఉండటం వల్లనే చెక్ బౌన్స్ అయిందని తెలిపారు. అలోక్ కు కొత్త చెక్ జారీ చేసినట్లు ఆయన వివరించారు. మొత్తం మీద యోగి తన చేతుల మీదుగా ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Similar News