వైసీపీ పార్లమెంటు సభ్యుల రాజీనామాలపై టీడీపీ కొత్త ఆరోపణలకు తెరలేపింది. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి మూడు రోజులవుతున్నా స్పీకర్ ఎందుకు ఆమోదించలేదని టీడీపీ ప్రశ్నిస్తోంది. స్పీకర్ వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించరని తాము మొదటి నుంచి చెబుతూనే వస్తున్నామని, అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ వ్యవహారాలు నడుస్తున్నాయంటున్నారు సైకిల్ పార్టీ నేతలు. స్పీకర్ ఫార్మాట్ లో వైసీపీ ఎంపీలు రాజీనామా లేఖలు సమర్పించినా అవి ఆమోదం పొందక పోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
లాలూచీ రాజకీయాలు....
వైసీపీ, బీజేపీలు కుమ్మక్కై లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని మొదటి నుంచి టీడీపీ ఆరోపిస్తూనే ఉంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి కార్యాలయంలో తిరిగే ఫొటోలను చూపుతూ ఈ ప్రచారాన్ని టీడీపీ ఎప్పటి నుంచో చేస్తూనే ఉంది. అయితే తాజాగా రాజీనామాలు ఆమోదం పొందకపోవడంపై టీడీపీ కమలం, ఫ్యాన్ పార్టీ బంధాలను మరోసారి బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తోంది. రాజీనామాలు ఆమోదం పొందడం లేదంటే ఇదంతా డ్రామాగా టీడీపీ అభివర్ణిస్తుంది.
వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్...
అయితే వైసీపీ నేతలు దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. రాజీనామాలు ఆమోదించే విషయం స్పీకర్ విచక్షణాధికారమన్న విషయం వారికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తే, వారిపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ కొన్నేళ్ల నుంచి నానుస్తూ ఉండటాన్ని వైసీపీ గుర్తుకు తెస్తోంది. తాము రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్ లో నే చేశామని, ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగామంటే అది కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయడానికేనన్న విషయం తెలియదా..? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.మొత్తం మీద వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికే సమయం వెచ్చిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.