ఓటమికి ఆ ముగ్గురే కారణమా?

మూడు ప్రాంతాల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయింది. కారణాలపై జగన్ అధ్యయనం చేయాల్సి ఉంది

Update: 2023-03-19 06:03 GMT

మూడు రాజధానులు పనిచేయలేదు. మూడు ప్రాంతాల్లో ఫ్యాన్ తిరగలేదు. మూడు చోట్ల అధికార వైసీపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టాయి. ఇదేం రిజల్ట్? ఎన్నికల్లో అవతవకలు.. ఇవన్నీ కుంటిసాకులే. ఎన్ని పొరపాట్లు... మూడు ప్రాంతాలకు ముగ్గురు కన్వీనర్లు. ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొకరు వైవీ సుబ్బారెడ్డి, మరొకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ముగ్గురు ఆప్తులను నియమించుకున్నారు. నమ్మకమైన వారే కనుక తనకు ఇబ్బంది ఏమీ ఉండదని జగన్ భ్రమించారు. కానీ ఏమయింది? ఫ్యాన్ రివర్స్ లో తిరిగింది. నాలుగేళ్లుగా నెత్తీ నోరు మొత్తుకుంటున్నా నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు సమసి పోలేదు.


నేతల మధ్య విభేదాలు...

విభేదాలను పరిష్కరించే సమయం, తీరిక రెండూ జగన్ కు లేవు. అందుకే ఆ ముగ్గురి మీదనే భారం పెట్టారు. వారిపైనే పూర్తిగా వదిలేశారు. నేతల మధ్య సమన్వయం తనను చూసే వస్తుందనుకున్నారు. తాను తెచ్చే ఫలితాలే అన్నీ సెట్ చేస్తాయని జగన్ భ్రమించారు. కానీ చివరకు ఏం జరిగింది? గెలవాల్సిన ఎన్నికల్లో చతికలపడాల్సి వచ్చింది. విభేదాలు పరిష్కరించలేని ఆ ముగ్గురి నేతలను నిందించాలా? లేక నిర్లక్ష్యం, అతి విశ్వాసాన్ని ప్రదర్శించిన జగన్ ను అనాలా? అన్నది ఫ్యాన్ పార్టీ అసలైన కార్యకర్తకు అంతుపట్టడం లేదు. నేతలు బాగానే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త మాత్రమే ఈ ఓటమికి బాధపడుతున్నారు. జీర్ణించుకోలేకపోతున్నాడు. వై నాట్ 175 నినాదం వినిపించడానికి బాగానే ఉన్నా... కిందిస్థాయిలో అది లేదన్నది జగన్ గుర్తించ లేకపోయారు.
కార్యకర్తలను పట్టించుకోకుండా...
ఇక గత నాలుగేళ్లుగా 2019 ఎన్నికల్లో పనిచేసిన ముఖ్య కార్యకర్తలను పార్టీ నేతలు ఎక్కడ పట్టించుకున్నారు? ఇదీ వారి నుంచి ఎదురవుతున్న ప్రశ్న. నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అసలైన కార్యకర్తలను వదిలేశారు. తమ సొంత నిధులను ఖర్చు పెట్టి జగన్ ను గెలిపించడం కోసం పనిచేసిన కార్యకర్తలు కూడా నాలుగేళ్లుగా గోళ్లు గిల్లుకుంటున్నారు. ఈ విషయం హైకమాండ్ కు తెలియంది కాదు. పీకే టీం ముందే హెచ్చరించింది. అందుకే నియోజకవర్గాల వారీగా జగన్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిపారు. కానీ ఆ సమావేశంలోనూ ఆయన ఏం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఈయన.. ఆయననే గెలిపించుకు రావాలంటూ పిలుపునిచ్చారు తప్పించి వారి నుంచైనా రియల్ ఫీడ్ బ్యాక్ ను తీసుకోవడానికి ప్రయత్నించారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

జగన్ కు తీరికలేదా?
ఓటర్లను గుర్తించి పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్లే బాధ్యత జెండా పట్టుకున్న కార్యకర్త మాత్రమే తీసుకుంటాడు. కానీ వారు కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయిన విషయాన్ని జగన్ సకాలంలో గుర్తించినా అందుకు తగిన చర్యలు తీసుకోలేక పోయారు. ఎమ్మెల్యేలను మందలించలేకపోయారు. తన పథకాల వల్లనే గెలుస్తారన్న ధీమా తప్ప కార్యకర్తలే రేపటి ఎన్నికలకు కూడా ముఖ్యమని జగన్ ఎందుకు గుర్తించలేకపోయారు. ఇదీ సగటు వైసీపీ కార్యకర్త వేస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కనుక యాక్టివ్ చేయగలిగితే తిరిగి పుంజుకోవచ్చు. కానీ అది మన సీఎం సర్ కు ఉండాలి గా. ఎందకంటే ఆయన ముఖ్యమంత్రి. ఎవరితో మాట్లాడే ఓపిక, తీరిక ఆయనకుండదు.


Tags:    

Similar News