ప్రొటెం స్పీకర్ నియామకంపై కాంగ్రెస్, జేడీఎస్ లు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటక గవర్నర్ తీసుకున్న మరో నిర్ణయంపై కాంగ్రెస్, జేడీఎస్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రొటెం స్పీకర్ గా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే బొపయ్యను నియమించడంపై కాంగ్రెస్, జేడీఎస్ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు లో రెండు వర్గాలు వాదనలు విన్పించాయి. బీజేపీ తరుపున ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించగా, కాంగ్రెస్ తరుపున సింఘ్వీ, జేడీఎస్ ల తరుపున కపిల్ సిబల్ వాదనలు విన్పించారు. బొపయ్య నియామకంపై తమకు అభ్యంతరాలున్నాయని కపిల్ సిబల్ తెలిపారు. తాము అభ్యంతరం తెలపడానికి బొపయ్య గత చరిత్ర కారణమని అన్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం వరకూ బొపయ్య ప్రొటెం స్పీకర్ వ్యవహరిస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే ఆతర్వాత కార్యక్రమానికి ఆయనను అనుమతించవద్దని కపిల్ సిబల్ కోరారు. బలపరీక్ష అంతా లైవ్ ఇవ్వాలని ఆదేశిస్తామనిసుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే తెలిపారు. బొపయ్య నియామకం పై విచారించాలంటే ముందు ఆయనకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నోటీసులు ఇవ్వాలంటే బలపరీక్ష వాయిదా వేయాల్సి ఉంటుందన్నారు. డివిజన్ ద్వారా బలపరీక్ష జరపాలని ప్రొటెం స్పీకర్ ను ఆదేశిస్తామని ఆయన తెలిపారు. బలపరీక్ష అన్ని ఛానల్స్ లైవ్ ఉంచాలని జస్టిస్ సిక్రీ అన్నారు. ప్రొటెం స్పీకర్ పై కాంగ్రెస్, జేడీఎస్ లు వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే బలపరీక్ష అంతా లైవ్ లో ఇవ్వాలని ఆదేశించింది. దీంతో యడ్యూరప్పకు ఊరట లభించినట్లయింది.