జగన్ టూర్ లో ఈ తిప్పలేమిటో...!

Update: 2018-06-16 02:30 GMT

వైసిపి అధినేత వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలో చేస్తున్న పాదయాత్ర జనానికి చేదు అనుభవాలను మిగులుస్తోందని, కొందరు పోలీసులు భద్రత పేరుతో జగన్ ను కలిసేవారిని తోసేస్తూ ఉండటంతో వారు నిరాశగా వెళుతున్నారు. సామాన్యులే కాకుండా ఈ కోవలోకి కొందరు నేతలు వచ్చి చేరుతున్నారు. వారంతా తమ బాధ ఎవరికి చెప్పుకోలేక మధన పడుతున్నారు. నియోజకవర్గాల్లో కింగ్ ల్లా చెలామణి అవుతూ భారీ క్యాడర్ ను వెంటేసుకు తిరిగే వారు మరింత వేదన చెందుతున్నారు. తమ పరిస్థితి చెప్పుకుంటే క్యాడర్ దగ్గర వీక్ అవుతామని కొందరు కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నారు. వైసిపి అధినేత పర్యటన ప్రారంభం నుంచి పోలీసులు ఇదే తీరులో ఉన్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. పోలీసులు సామాన్యులపై దౌర్జన్యం చేస్తున్న దృశ్యాలు, చిత్రాలు సైతం వైసిపి అభిమానులు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కొందరు ప్రభుత్వ ఆదేశాలప్రకారం జగన్ టూర్ లో ఇలా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు చేసేస్తున్నారు.

వారధిపై ఖాకీల అపూర్వ సేవలు...

చారిత్రక రాజమండ్రి రోడ్ కం రైలు వంతెన పై పోలీసులు అందించిన సేవలకు మాత్రం వైసిపి నేతలు ఫిదా అయ్యారు. బ్రిడ్జి రైలింగ్ బలహీనంగా వున్న నేపథ్యంలో కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు అటు ఇటు 9 కిలోమీటర్ల మేర రైలింగ్ కి ముందు తాడు కట్టి అత్యంత జాగ్రత్తగా భద్రతా చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. వారధి రైలింగ్ బలహీనంగా ఉండటం లెక్కలేనంత మంది అభిమానులు జగన్ వెంట రావడంతో పోలీసులు ముందస్తుగా రూట్ మార్చాలని వైసిపి నేతలను కోరినా వారు ఖాకీ బాస్ లను కన్విన్స్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం తో ఇబ్బందులు లేకుండా పర్యటన సాఫీగా నడిచింది. పోలీసుల సేవలను అర్బన్ జిల్లా ఎస్పీ ముందు చూపును వైసిపి కో ఆర్డినేటర్లు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలపడం విశేషం.

శిబిరానికి వచ్చి కలవండి ...

భద్రతా పరమైన ఆంక్షలు భారీ జనసందోహం నడుమ తనను నేరుగా కలుసుకోలేని వారిని రాత్రి బస చేసే శిబిరం వద్దకు వచ్చి కలవ వచ్చని జగన్ తన సభల్లో తెలియచేస్తున్నారు. ప్రజలు అనేక సమస్యలతో తనను వచ్చి కలవాలని ప్రయత్నాలు చేస్తారని పాదయాత్రలో కలవలేని పక్షంలో ఆందోళన చెందాలిసిన పనిలేదని జగన్ పిలుపునిచ్చారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి పోలీసులకు సహకరించాలని ప్రతిపక్ష నేత విజ్ఞప్తి చేయడం విశేషం.

Similar News