ఇప్పుడు చంద్రబాబునాయుడు రెండే రెండు స్లోగన్స్ తో ప్రజల ముందుకు వెళుతున్నారు. అందులో ఒకటి స్పెషల్ స్టేటస్ కాగా... మరొకటి నెంబర్ వన్ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. ఆ రెండు పదాలతోనే ఆయన ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుంది. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. నాలుగేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉన్నప్పటికీ చంద్రబాబు ఆశించన మేరకు నిధులు సమకూరలేదు. అనుకున్న మేరకు కేంద్రం నుంచి సాయం అందలేదు. దీంతోనే చంద్రబాబు ప్రత్యేకహోదా నినాదాన్ని భుజానికెత్తుకున్నారు.
వారం రోజుల నుంచి....
ఇక స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గత వారం రోజుల నుంచి నవనిర్మాణ దీక్షల్లో తనకు మరోసారి అవకాశమివ్వాలని, ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తానని చెబుతూ వస్తున్నారు. ప్రధాని మోడీ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడంతో పాటుగా విపక్షాలయిన వైసీపీ, జనసేనలను కూడా తూర్పారపడుతున్నారు. ఈ రెండు పార్టీలు బీజేపీ కోవర్టులుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.
జైలుకు వెళ్లాల్సి వస్తుందని......
వైసీపీ అధినేత జగన్ పిరికి పంద అని, శశికళ మాదిరి అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడిన జగన్ బీజేపీతో లోపాయికారీ ఒప్పందాలను కుదుర్చుకున్నారని చెబుతూ వస్తున్నారు. అందుకే జగన్ కేసులు ఒక్కొక్కటిగా నీరుగారి పోతున్నాయని, అవినీతి వైసీపీని పక్కన పెట్టాలని, తనకు మరో అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మలుస్తానని మాట ఇస్తున్నారు. అంతేకాదు ప్రజలు కూడా తనకు సహకరించాల్సిందేనంటున్నారు. తాను ఇరవై నాలుగు గంటలు రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతుంటే ఎందుకు సహకరించరని ప్రశ్నిస్తున్నారు. తనకు కాకుండా వేరే వాళ్లకు అధికారాన్ని అప్పజెబితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని చంద్రబాబు చెబుతున్నారు. తనను ఆశీర్వదించాలని, ఆదరించాలని బాబు పదే పదే కోరుతున్నారు.