బీజేపీని దేశంలో ఎక్కడా కనపడనివ్వనని మహానాడు వేదికగా ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శపథం చేశారు. అవసరమైతే అన్ని రాష్ట్రాలూ పర్యటించి మోడీకి వ్యతిరేకంగా కూటమి కడతానని చెప్పారు. బీజేపీ చేసిన నమ్మకద్రోహాన్ని అన్ని రాష్ట్రాల నేతలకూ వివరించి వారి మద్దతను కూడగడతానని చెప్పారు. తొలిరోజు మహానాడులో చంద్రబాబు మోడీపైన, ఇటు వైసీపీపైనా నిప్పులు చెరిగారు.
మోడీకి ప్రజాదరణ తగ్గింది......
మోడీకి రోజురోజుకూ ప్రజాదరణ తగ్గుతోందన్నారు. ఇటీవల జరిపిన సర్వేలో కూడా మోడీని 68 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వంద శాతం ప్రజలు మోడీని వ్యతిరేకించాల్సిన అవసరమంుదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ నిలువునా మోసం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 25 ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీకి ఇస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ముక్కుపిండి మరీ ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పారు.
లాలూచి పడి జగన్....
ఇక జగన్ బీజేపీతో లాలూచీ పడ్డారని విమర్శించారు. బీజేపీతో అనైకత ఒప్పందం వల్లనే జగన్ పై కేసులు వేగంగా విచారణ జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ మరో శశికళను కాకూడదనే బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవాళ్లు ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పుడే ఈ లాలూచీ రాజకీయాలు తనకు అర్థమయ్యాయన్నారు.
పవన్ అవగాహన రాహిత్యం......
పవన్ కల్యాణ్ అవగాహనతో మాట్లాడాలన్నారు. పవన్ కల్యాణ్ బస చేసిన చోట విద్యుత్తును కట్ చేసే అనైకిత రాజకీయాలకు తెలుగుదేశం పాల్పడదని చెప్పారు. ఉద్దానం సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతుంటే పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు. నాలుగేళ్లు మంచిగా కన్పించిన ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు చెడుగా మారిందో అందరూ అర్థం చేసుకోగలరని చంద్రబాబు అన్నారు. మొత్తం మీద మహానాడులో చంద్రబాబు బీజేపీ, వైసీపీ, జనసేనలపై విరుచుకుపడ్డారు.