దానిపై జగన్ జవాబు ఇదే

Update: 2018-06-15 02:30 GMT

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టీరీ ఏర్పాటుపై కేంద్రం వెనకడుగు వేయడాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన ట్విట్టరల్లో కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కడప జిల్లావాసుల చిరకాల వాంఛ అని, దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫడవిట్ ను జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారు. దీన్ని బట్టి చూస్తుంటే ఏపీ సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అయ్యేంత వరకూ తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

తెలుగుదేశం మాటల దాడి.....

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదని, ఆయన బీజేపీతో లాలూచీ రాజకీయాలు నడుపుతున్నందునే కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారని గత రెండు రోజులుగా తెలుగుదేశం మాటల దాడి చేస్తోంది. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆందోళనలను కూడా నిర్వహించింది. కాని వైసీపీ మాత్రం ఎటువంటి ఆందోళనలు చేయకుండా బీజేపీకి వత్తాసు పలుకుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

నాటకమన్న జగన్......

ముఖ్యంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ వైఖరిని తప్పుపట్టారు. తన సొంత జిల్లాకే అన్యాయం కేంద్రప్రభుత్వం చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నోరుమెదపక పోవడాన్ని సోమిరెడ్డి తప్పుపట్టారు. దీన్ని బట్టే బీజేపీ, వైసీపీ లాలూచీ రాజకీయాలు అర్థమవుతున్నాయని సోమిరెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో జగన్ ట్విట్టర్లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటో మొదటి నుంచి టీడీపీకి తెలుసని, అయితే అకస్మాత్తుగా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కోసం టీడీపీ ఆందోళనలు చేయడం ప్రజలను మోసం చేయడమేనని జగన్ అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు.

Similar News