జగన్ కోటను బద్దలు కొట్టే లక్ష్యంగా....?

Update: 2018-06-20 03:49 GMT

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మరికాసేపట్లో ఆమరణ దీక్షకు దిగబోతున్నారు. కడపలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగనున్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ ఈ దీక్షకు దిగనున్నారు. విభజన హామీల్లో భాగంగా కడప జిల్లాలో ఉక్క ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కడప ఉక్కు ఫ్యాక్టరీపై ఇప్పటికే అన్ని పార్టీలూ ఆందోళనలు ప్రారంభిచాయి. నిన్నటి నుంచే వైసీపీ నేతలు రాచమల్లు శివప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి దీక్షకు దిగారు. ఈరోజు కడప లో సీఎం రమేష్ ఆమరణ దీక్షతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

వాదోపవాదాలు.....

కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు అన్ని పార్టీలకూ అస్త్రంగా మారింది. ఇటీవల సుప్రీంకోర్టులో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేయడంతో అన్ని పక్షాలూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మరోవైపు బీజేపీ తాము కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపిస్తుంది. ఇలా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు పై బీజేపీ, టీడీపీల్లో బిన్న వాదనలు విన్పిస్తున్నాయి.

ఎంపీలు కడపకు.....

సీఎం రమేష్ దీక్షకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులందరూ మద్దతు తెలపనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కడపకు చేరుకున్నారు. సీఎం రమేష్ కు సంఘీభావం తెలిపి వారు కూడా ఒకరోజు దీక్షలో పాల్గొననున్నారు. కడపలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఉక్కు ఫ్యాక్టరీని ప్రధాన అస్త్రంగా మలచుకుంది. ఇప్పటికే పులివెందులకు నీళ్లు తెచ్చామని చెబుతున్న టీడీపీ ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళనతో జిల్లాలో మైలేజీ పెంచుకోవాలని చూస్తోంది. జగన్ కోటను బద్దలు కొట్టాలన్న చంద్రబాబు లక్ష్యం నెరవేరుతుందో? లేదో? చూడాలి.

Similar News