2003....2013.....2018.... ఈ సంవత్సరాలు వైఎస్సార్ ఫ్యామిలీకి గుర్తుండి పోతాయి. వైఎస్ కుటుంబం నుంచి ముగ్గురు ఈ వంతెన మీదుగానే పాదయాత్ర చేశారు. రాజమండ్రివాసులు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, షర్మిలకు అపూర్వ స్వాగతం పలికారు. తాజాగా మరికొద్దిసేపట్లో వైసీపీ అధినేత జగన్ రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జ్ మీదుగా రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. ఈ పాదయాత్రకు వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
గతంలో వైఎస్...షర్మిల.....
2003 మే 17వ తేదీన రాజమండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థాన పాదయాత్ర చేరుకోవడంతో రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జిపై అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్ కు అపూర్వ స్వాగతం లభించింది. వంతెన ఊగిపోయింది. వైఎస్ ను చూసేందుకు వచ్చిన జనంతో వంతెన కిటకిట లాడింది. ఆ వంతెన పై పాదయాత్ర దృశ్యాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. వైఎస్ తర్వాత ఆయన కూతురు షర్మిల కూడా పాదయాత్ర చేశారు. షర్మిల పాదయాత్ర 2013 జూన్ 4వ తేదీన ఈ వంతెన మీదుగానే రాజమహేంద్రవరంలోకి చేరుకుంది. షర్మిలకు కూడా ఘన స్వాగతం లభించింది.
పాదయాత్రకు భారీ ఏర్పాట్లు.....
ఇప్పుడు తాజాగా వైఎస్ కుటుంబంలోని మూడో వ్యక్తి ఇదే వంతెనపై నుంచి పాదయాత్ర చేయనున్నారు. ఇందుకోసం వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. వంతెన 3.5 కిలోమీటర్ల పొడవునా జగన్ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ వైసీపీ జెండాలు కట్టారు. గోదావరి నదిలో 600 పడవలను ఉంచారు. ఈ పడవలపై కార్యకర్తలు జెండాలను ఊపుతూ జగన్ కు స్వాగతం చెప్పనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ డీలా పడింది. ఆశించిన సీట్లు దక్కలేదు.
తూర్పు మాదేనంటున్న......
తాజాగా జగన్ పాదయాత్రతో తూర్పులో పార్టీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అత్యధిక స్థానాలను వైసీపీయే గెలుచుకునే వీలుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబును రాష్ట్రానికి ఏదో చేస్తారని ప్రజలు విశ్వసించారని, అయితే నాలుగేళ్లుగా జరుగుతున్న పరిణామాలను చూసి బాబు పార్టీని పక్కన పెట్టడం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద రాజమండ్రి రైలు కం రోడ్డు బ్రిడ్జిపై పాదయాత్ర మరో చరిత్ర సృష్టించనుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.