జగన్ ప్రజా సంకల్ప యాత్ర 189 వ రోజు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతుంది. వైసిపి అధినేత జగన్ కి అడుగడుగునా జన నీరాజనం వెల్లువలా వస్తుంది. ఇక సెంట్రల్ డెల్టా మీదుగా తూర్పున నడుస్తున్న జగన్ పాదయాత్రకు వినూత్న రీతిలో స్వాగత ఏర్పాట్లు అభిమానులు చేయడం విశేషం గా ఆకట్టుకుంటుంది. సెంట్రల్ డెల్టా కాలువపై పెద్ద ఎత్తున పడవలు ఏర్పాటు చేసి వాటిపై జగన్ కటౌట్ తో పాటు వైఎస్ ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు, వైసిపి నవరత్నాల హామీలను ప్రదర్శించిన తీరు అందరిని కట్టిపడేస్తుంది. ఆత్రేయపురం మండలం పేరవరంలో రాత్రి బస నుంచి బయల్దేరిన జగన్ ను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు.
కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ...
బిసి కులాల్లోని కుల వృత్తులను నమ్ముకుని జీవనం గడవక దుర్భర పరిస్థితుల్లో వున్నవారిని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటానని జగన్ తనను కలిసిన ఆ సంఘాల ప్రతినిధులకు హామీనిచ్చారు. ఆర్ధికంగా వారిని పైకి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు జగన్. అదేవిధంగా చట్టసభల్లో వారికి సమాన అవకాశాలు దక్కేలా చూస్తా అన్నారు. పులిదిండి ప్రాంతం మీదుగా సాగుతున్న జగన్ యాత్రలో గీత కార్మికులు ఆయన వెంట నడిచారు. వారి సమస్యలను విన్న జగన్ వైసిపి అధికారంలోకి వస్తే గీత కార్మికుల ఆర్ధిక స్థితిగతులు మారేలా చర్యలు చేపడతా అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెట్టిన నాటినుంచి వివిధ సంఘాల నేతలు, కార్మికులు, అన్నదాతలు కులసంఘాల నేతలు జగన్ పాదయాత్రలో ఆయనతో పదం కదుపుతూ తమ సమస్యలు నివేదిస్తూ పరిష్కారానికి హామీలు వరాలు విపక్ష నేత నుంచి పొందడం విశేషం.