టీడీపీ ఓటుబ్యాంకు కొల్లగొట్టేందుకు జగన్...?

Update: 2018-05-09 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చట్ట సభల్లో కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో ఆ యా సామాజిక వర్గాలను ఫ్యాన్ పార్టీ వైపు తిప్పుకునేలా ఆయన హామీలు గుప్పిస్తూ వస్తున్నారు. జగన్ ప్రస్తుతం ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను నాయీ బ్రాహ్మణులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ వారికి హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాయిబ్రాహ్మణులకు చట్టసభల్లో చోటు కల్పిస్తామని చెప్పారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న సెలూన్లకు 250 యూనిట్ల వరకూ విద్యుత్తు ఛార్జీలు ఉండవని చెప్పారు. ఉచితంగానే విద్యుత్తును అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే నాయీ బ్రాహ్మణులకు ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు.

నాయీ బ్రాహ్మణులకూ ఎమ్మెల్సీ....

గతంలోనూ వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు బీసీల ఆత్మీయ సమ్మేళనంలో వడ్డెరలకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు కర్నూలులో పాదయాత్ర జరిగే సందర్భంలో బీసీలకు ఎంపీ సీటును కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్ వివిధ సామాజిక వర్గాల ఆత్మీయ సదస్సుల్లో పాల్గొంటున్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, రైతు సదస్సులను ఆ పార్టీ ప్రతి జిల్లాలో్నూ నిర్వహిస్తోంది. ఈ సదస్సులలో జగన్ వారికి అనేక హామీలు గుప్పిస్తూ వస్తున్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా, వారికి చట్టసభల్లో చోటు కల్పిస్తామనిచెప్పడంవిశేషం.

ప్రతి సామాజిక వర్గమూ....

ఆంధ్రప్రదేశ్ లో బీసీల ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచే బీసీల్లో ఎక్కువ భాగం సైకిల్ పార్టీకే జై కొడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టి, తన పార్టీ వైపునకు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. చట్ట సభల్లో ప్రతి కులానికి చెందిన వారూ సభ్యులుగా ఉంటే వారి సమస్యలను ప్రభుత్వానికి వివరించడం, పరిష్కరించుకోవడం సులువవుతుందని జగన్ చెబుతూ వస్తున్నారు. ఇప్పటికేజగన్ తన పాదయాత్రలో ఐదు సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీ పదవులను ఇస్తామనిహామీ ఇవ్వడం విశేషం.

Similar News