దుమ్ము లేపుతున్నాడు... దమ్ములేదా?

వైసీపీ అధినేత జగన్ నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు

Update: 2023-03-09 04:36 GMT

వైసీపీ అధినేత జగన్ నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఆయనను పార్టీ నుంచి ఇప్పటికే బహిష్కరించాల్సి ఉంది. అలాగే స్పీకర్ కు ఆయనపై ఇచ్చిన అనర్హత వేటు విషయంలోనూ ఫాలో అప్ లేదు. ఎందుకిలా? అని పార్టీలో చర్చ జరుగుతుంది. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును మూడేళ్ల నుంచి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కిందిస్థాయి పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఆయనపై కనీస చర్యలు లేకపోవడంతో జగన్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఆయన ఆ ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు.

నెల్లూరు జిల్లాలో...

ఇటీవల నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై పరోక్ష చర్యలైనా జగన్ తీసుకున్నారు. రఘురామ కృష్ణరాజుతో పోలిస్తే పార్టీపైనా, ప్రభుత్వంపైనా వారి విమర్శలు పెద్దగా ఘాటుగా లేకపోయినా వెంటనే హడావిడిగా ఇన్‌ఛార్జులను నియమించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డిని, వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమిల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోనే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కూడా. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేసినందుకు కొత్తపల్లిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేశారు.
మూడేళ్ల నుంచి...
కానీ అంతకు మించి... వారి కంటే ఎక్కువగా ప్రతి రోజూ రచ్చ బండ పేరుతో ప్రతి అంశంపై ప్రభుత్వంతో పాటు జగన్ ను, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తున్నారు. సర్వేలు చేయిస్తున్నారు. వైసీపీ ఓటమి ఖాయమని చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం ఎలాంటి చర్యలకు పూనుకోవడంపై పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రఘురామ కృష్ణరాజు విమర్శలు ప్రారంభించిన తొలినాళ్లలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోయేది కదా? అన్న ప్రశ్న తలెత్తింది. నరసాపురం పార్లమెంటుకు ఉప ఎన్నికలు జరిగితే వైసీపీకి ఇబ్బందులు వస్తాయని జగన్‌కు ఏదైనా సర్వే నివేదిక అందిందా? అన్న చర్చ కూడా జరగుతుంది.
ఇప్పటికైనా...
అయితే పార్టీ నుంచి బహిష్కరించినా, సస్పెండ్ చేసినా ఉప ఎన్నికలు రావు. రఘురామ కృష్ణరాజు స్వతంత్రంగా ఎంపీగానో, మరో పార్టీకి అనుబంధ సభ్యుడిగానో చేరవచ్చు. అప్పుడు విమర్శలు చేసినా వాటికి పెద్ద విలువ ఉండదు. ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా విపక్ష పార్టీల విమర్శలుగానే చూస్తారు. కానీ జగన్ సస్పెండ్ చేయలేదు. బహిష‌్కరణ చేయలేదు. కేవలం స్పీకర్ పై అనర్హత వేటుకు సంబంధించి ఫిర్యాదు చేసి వదిలేశారు. దీంతో రఘురామ కృష్ణరాజు రోజూ రచ్చబండ ఏర్పాటు చేసి దుమ్ము దులుపుతున్నారు. ఇక ఎన్నికలకు ఏడాదికి మించి సమయం లేదు. ఆయనను ఇప్పటికైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం అయితే బలంగా వినపడుతుంది. కానీ జగన్ ఎందుకు భయపడుతున్నారన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న.


Tags:    

Similar News