వాట్స్ అప్ కొంపముంచిందిగా ...!

Update: 2018-07-25 02:30 GMT

వాట్స్ అప్ ... ఒక్క సెకన్ ఆగినా నెటిజనం భరించలేరు. అన్నంతగా ప్రజల జీవితాలతో ముడిపడిపోయింది. సోషల్ మీడియా లో వున్న పలు సామాజిక వేదికల్లో వాట్స్ అప్ వేగం అంతా ఇంతా కాదు. ఇందులో నెటిజెన్స్ క్రియేట్ చేస్తున్న గ్రూప్ ల సంగతికి వస్తే అందులోనే రోజంతా గడిపే వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఎవరు ఏ గ్రూప్ ప్రారంభిస్తారో ఎప్పుడు అందులో ఎవరు ఏ పోస్ట్ పెడతారో తెలియని పరిస్థితి. దీనికి తోడు కొన్ని గ్రూప్ లు అయితే సభ్యులందరినీ అడ్మిన్ చేసేస్తాయి. మరికొన్ని గ్రూప్స్ లో కొందరే అడ్మిన్ గా వుంటూ జాగ్రత్తగా పోస్ట్ లు చేసుకుంటారు. కాకపోతే చాలామందికి సోషల్ మీడియా ను వాడటం వచ్చు కానీ దాన్ని ప్రమాదం లేకుండా ఉపయోగించుకోవడం తెలియదు. గ్రూప్ ప్రారంభించే అడ్మిన్ లు ఇప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే గ్రూప్ లో ఏ సభ్యుడు తప్పుడు పోస్ట్ పెట్టినా అడ్మిన్ దే పూర్తి బాధ్యత.

అడ్మిన్ అయినందుకు ఐదునెలలుగా జైల్లో...

ఇక విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాజ్ ఘర్ జిల్లా తలెన్ పట్టణంలోని జునైద్ ఖాన్ ఐ టి చట్టం 214 ( ఎ ) కింద పోలీసులు కేసు పెట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 14 న అరెస్ట్ చేశారు. జునైద్ చేసిన తప్పేమిటి అంటే వాట్స్ అప్ గ్రూప్ లో అడ్మిన్ తప్పుకోవడంతో ఆటోమేటిక్ గా అడ్మిన్ అయ్యి గ్రూప్ లో కొనసాగిన పాపానికి జైలు కి పోవడం. అసలు ఏం జరిగిందంటే.... జునైద్ ఒక వాట్స్ అప్ గ్రూప్ లో సభ్యుడు. ఆ గ్రూప్ కి అడ్మిన్ అయిన ఇర్ఫాన్ అభ్యంతరకర పోస్ట్ ను ఫార్వార్డ్ చేశాడు. అది వైరల్ గా మారింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఈ గొడవ గుర్తించిన ఇర్ఫాన్ గ్రూప్ అడ్మిన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ వెంటనే జునైద్ ఖాన్ అడ్మిన్ గా అతనికి తెలియకుండానే అయిపోయాడు.

ఏ తప్పు చేయకపోయినా.....

ఈ విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ తరువాత పోలీసులు కేసు నమోదు చేయడం. దేశద్రోహం అభియోగాలతో జునైద్ ను అరెస్ట్ చేసి లోపలేయడం జరిగిపోయాయి. బిఎస్సి పరీక్షలకు వెళ్ళలిసిన జునైద్ జైలుకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కోర్ట్ ను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. దేశ ద్రోహ అభియోగాలు కావడంతో హై కోర్ట్ సైతం బెయిల్ కి నిరాకరించింది. ఏ తప్పు చేయకపోయినా వాట్స్ అప్ ఆ యువకుడి జీవితంలో నిప్పులు పోసింది. ఈ అంశంలో తాము ఏమి చేయలేమని పోలీసులు సైతం చేతులు ఎత్తేశారు. కేసు నమోదు అయ్యే సమయానికి ఎవరు అడ్మిన్ అయితే వారే బాధ్యులని ఖాకీలు సెలవిచ్చారు. ఇప్పటికి ఐదు నెలలు అయినా జునైద్ బయటకు రాలేదంటే వాట్స్ అప్ అడ్మిన్స్ బీ కేర్ ఫుల్ ...!

Similar News