డబ్బు కోసం ఎంత పని చేస్తున్నారు ...?

Update: 2018-08-12 02:32 GMT

డబ్బు కోసం ఎలాంటి పనికైనా దిగిపోతున్నాయి కొన్ని ఆసుపత్రులు. ఫలితంగా మొత్తం వైద్య వృత్తికే కళంకం తెస్తున్నాయి. తాజాగా విజయవాడలో కృత్రిమ గర్భధారణ కోసం ఒక అవివాహితకు డబ్బు ఆశ పెట్టి సరోగసి చేద్దామన్న ప్రయత్నాలు ఆమె ఎదురు తిరగడంతో బెడిసి కొట్టింది. ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఖాకీల ప్రాధమిక విచారణలో ఆసుపత్రి వైద్యులదే తప్పు అని కూడా తేలిపోయింది. ఇంకేముంది విషయం లీక్ కావడంతో కేసులోని వైద్యులు పలాయనం చిత్తగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అసలు ఏం జరిగిందంటే ...

విజయవాడలోని కార్తికదత్త ఐవిఎఫ్ సంతాన సాఫల్య కేంద్రం ఒక కృత్రిమ గర్భధారణ కోసం ఒక మహిళను బలవంతంగా ఒప్పించింది. ఆసుపత్రికి చెందిన సంధ్య అనే నర్స్ పేదరికం లో వున్న గుంటూరు మహిళకు డబ్బు ఆశ చూపించి ఒప్పించింది. ఒప్పందం ప్రకారం ఆమెకు మూడున్నర లక్షల రూపాయలు చెల్లించాలి. ఆమె అవివాహిత కూడా కావడం గమనార్హం. తొలుత బాధితురాలు అంగీకరించి ఆసుపత్రిలో చేరాక ఆమెకు ఇచ్చిన ఇంజెక్షన్ లు వికటించి వాంతులు రావడంతో ఆమె భయపడి తనకు ట్రీట్ మెంట్ చేయొద్దని వేడుకుంది. ఆయినా ఆమెను నిర్బంధించి ఆసుపత్రి యాజమాన్యం బలవంతంగా వైద్యం మొదలు పెట్టడంతో అక్కడినుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. వాస్తవానికి సరొగసి కు అనుసరించాలిసిన నిబంధనలు ఏవి ఆసుపత్రి వర్గాలు పాటించకపోవడం వారి దుర్మార్గానికి పరాకాష్ట గా నిలుస్తుంది. మరోపక్క బాధితురాలు తమను బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు ఆరోపించడం మరో కొసమెరుపు.

Similar News