ఇంతకీ రెండువేల నోట్లు ఏమయ్యాయి?

గత కొన్ని నెలలుగా రెండు వేల నోట్లు కనిపించడం లేదు. ఏటీఎంలలోనూ రావడం లేదు

Update: 2023-02-19 04:47 GMT

రిజర్వ్ బ్యాంకు రెండు వేల నోట్ల రూపాయల నోట్లను విడుదల చేసింది. విడుదల చేసిన కొత్తలో ప్రతి ఏటీఎంలోనూ రెండు వేల నోట్లు దర్శనమిచ్చేవి. అయితే గత కొన్ని నెలలుగా రెండు వేల నోట్లు కనిపించడం లేదు. ఏటీఎంలలోనూ రావడం లేదు. అన్నీ ఐదు వందల రూపాయలే వస్తున్నాయి. రాజకీయంగా రెండు వేల నోట్లు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు వేల నోట్లు చలామణిలోనే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతుంది. అయితే రెండు వేల నోటు చూసి చాలా కాలమయిందనే వారు ఎక్కువగానే కనపడుతున్నారు.

ఏటీఎంలలో...
అయినా అవి దొరక్క పోతుండటంతో బ్యాంకు నుంచి నేరుగా డ్రా చేసే వారికి లభ్యమవుతున్నాయా? అన్న సందేహమూ కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల నోటును రద్దు చేసి రెండు వేల నోట్ల రూపాయలను విడుదల చేసిన తర్వాత ఎక్కడ చూసినా అవే దర్శనమిచ్చాయి. వాటికి చిల్లర దొరకడం కూడా కష్టంగా మారేది. ఏటీఎం నుంచి రెండు వేలకు మించి నగదును డ్రా చేస్తే రెండు వేల రూపాయల నోట్లు వచ్చేవి.
రాజకీయ విమర్శలు...
కానీ గత కొంతకాలంగా రెండు వేల నోట్లు కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఏపీలో రెండువేల నోట్లు కనిపించకపోవడానికి కారణం జగన్ అని విమర్శలు చేస్తున్నారు. పెద్దయెత్తున డబ్బులు కూడగట్టేందుకు రెండువేల నోట్లు జగన్ అండ్ కంపెనీ తీసుకుంటుందని, అందుకే ప్రజలకు అవి అందుబాటులో లేకుండా పోయాయని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఇవి పూర్తిగా రాజకీయపరమైన ఆరోపణలేగానే చూడాలని బ్యాంకు అధికారులు కూడా చెబుతున్నారు.
తెలంగాణలోనూ...
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలోనూ రెండు వేల రూపాయల నోట్లు కనిపించడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేతలు రెండు వేల నోట్లను కూడబెడుతున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్ లాంటి నగరంలోనూ రెండు వేల నోటు కనిపించకుండా పోయింది. తెలుగు రాష్ట్రంలోనే ఈ పరిస్థితి ఉందా? దేశమంతా రెండువేలు నోటు కనపడకుండా పోయిందా అన్నది చెప్పాల్సి ఉంది.  కావాలని ఆర్బీఐ ఈ నోటు ముద్రణను నిలిపివేసిందా? లేక నిజంగానే కొరత ఏర్పడిందా? అన్నది తేలాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు మాత్రమే పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.


Tags:    

Similar News