హీరోలంతా కఠిన నిర్ణయం తీసుకున్నారా ...?

Update: 2018-04-25 02:30 GMT

సినిమా ఇండస్ట్రీలో ఏ వివాదం వచ్చినా పెద్దన్న పాత్రను పోషించేవారు దర్శకరత్న దాసరి నారాయణ రావు. ఆయన మరణం తర్వాత ఆ లోటు ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ వివాదంతోనూ ఇతర అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతుంది. ఈ సమస్యలకు పరిష్కారం వెతికేవారు ఎవరు ? అంటూ అంతా దిక్కులు చూస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అయ్యారు. నేనున్నా మీ కోసం అంటూ ఆయన దాసరి పాత్రను పోషించేందుకు ఒక అడుగు ముందుకు వేశారు. ఇటీవల శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ వివాదం, ఆ తరువాత పవన్ కళ్యాణ్ పై కొన్ని ఛానెల్స్ పనిగట్టుకుని మరీ వేస్తున్న బురద..... ఇలా అనేక వాటిపై చర్చించేందుకు చిరంజీవి నడుం కట్టారు. టాప్ హీరోలందరితో అన్నపూర్ణ స్టూడియోస్ లో సమావేశం నిర్వహించారు.

మీడియా కు అనుమతి నో ...

టాలీవుడ్ టాప్ హీరోలు అంతా ఒక చోట సమావేశం అయినా ఒక్క కెమెరా కూడా అనుమతించలేదు. న్యూస్ ఛానెల్స్ చేస్తున్న రచ్చ ఇండస్ట్రీకి తలపోటుగా మారడం, లేని వివాదాలు సృష్ట్టించి మరీ కొన్ని ఛానెల్స్ హీరోలపై రేటింగ్స్ కోసం రుద్దేయడంతో అంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎదో సందర్భంలో ప్రతి ఒక్కరూ న్యూస్ ఛానెల్స్ బాధితులే కావడంతో అందరు మీడియా కు నో చెప్పాలనే డిసైడ్ అయిపోయారు. అంతే కాదు ఈ రహస్య సమావేశంలో ఇకపై మీడియా కు సినిమాల కంటెంట్ ఇవ్వకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొన్ని ఛానెల్స్ పై బ్యాన్ పెట్టేశారు. తనను బద్నామ్ చేయడమే పనిగా పెట్టుకున్న న్యూస్ ఛానెల్స్ పై న్యాయపోరాటానికి సైతం దిగారు పికె. చిన్న పిల్లలు చెడిపోతారని పిలుపు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ పెట్టిన డిమాండ్లను ఇండస్ట్రీ ఏ మేరకు ఆమోదించింది అనేది తెలియాలిసివుంది.

చరిత్రలో తొలిసారి ....

వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, నిర్మాతల మండలి కానీ ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. కానీ చిరంజీవి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి చొరవ తీసుకుని ఈ భేటీ ఏర్పాటు చేయడం టాలీవుడ్ చరిత్రలో తొలిసారి కావడం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ బాద్ షా చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి ఆహ్వానిస్తే రాకుండా ఎవరు వుంటారు. అగ్ర హీరోలు అంతా వచ్చి పాల్గొన్నారు. హీరోలు వెంకటేష్, నాగచైతన్య, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగబాబు, నాని, రామ్ చరణ్, శ్రీకాంత్, జీవితా, రాజశేఖర్, మంచు లక్ష్మి,వంటి వారితో బాటు అల్లు అరవింద్ మరికొందరు నిర్మాతలు సైతం హాజరయ్యారు. దాదాపు 18 మంది నుంచి 20 మంది వరకు హాజరయిన ఈ సమావేశం గంటన్నరపాటు లోతుగా పలు అంశాలపై చర్చలు జరిపింది. టాలీవుడ్ అభివృద్ధి తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సూచనలను సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

Similar News