హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల పై తాజా గా రేగిన వివాదం యాదృచ్చికంగా జరిగిందా ? కేంద్రం తిరుమల స్వాధీనానికి కుట్ర చేస్తుందా ? దీనికి నేపధ్యం ఏంటి ? ఎందుకిలా ? అంటే చాలా రకాల విశ్లేషణలు చేస్తున్నారు విశ్లేషకులు. కలియుగ వైకుంఠం శ్రీనివాసుని సన్నిధి ప్రపంచ ప్రసిద్ధి గాంచినది. అత్యంత పురాతన ఆలయంపై ఆధిపత్యం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఈనాటివి కావు. వేలకోట్ల శ్రీమంతుడైన శ్రీనివాసుని ఆలయం తమ ఆధీనంలో ఉండేలా కేంద్రం కుట్ర మొదలు పెట్టిందనే అనుమానం సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశమే అయ్యింది.
పురావస్తు శాఖ లేఖతో కలవరం ...
కేంద్ర పురావస్తు శాఖ అమరావతి కార్యాలయం టిటిడి ఈవోకు లేఖ రాసింది. చారిత్రక సంపదగా వుండాలిసిన పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారని తిరుమలను తమ శాఖ పరిధిలో కలుపుకోనున్నట్లు లేఖ సారాంశం. ఈ లేఖ వ్యవహారం బయటకు పొక్కడంతో ఎపి వ్యాప్తంగా ఆగ్రహ జ్వలలు పెల్లుబికాయి. దీనికి తోడు ఏపీలో హోదా సెంటిమెంట్ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న నేపథ్యంలో తిరుమల సెంటిమెంట్ జత కలిస్తే మరింత మైనస్ లోకి వెళ్తామని భావించిన కేంద్రం తమకు ఆ ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పింది. అమరావతి కార్యాలయంలో జరిగిన పొరపాటుగా తేల్చి పాడేసింది. ఆ విషయాన్ని టిటిడి పాలకమండలి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు పురావస్తు శాఖా కేంద్ర అధికారులు స్పష్టం చేశారు.
గతం నుంచి ఇలాంటి ప్రయత్నాలే ...
గతంలో ఆదికేశవులనాయుడు టిటిడి ఛైర్మన్ గా వున్న సమయంలో వెయ్యికాళ్ళమండపం అంశంలోనూ ఇలాంటి వివాదాలే చెలరేగాయి. అలాగే ఆనందనిలయానికి బంగారు తాపడం చేయించే అంశంలోనూ పురావస్తు శాఖ అభ్యంతర పెట్టింది. శ్రీవారి ఆలయంపై వున్న శాసనాలు కనుమరుగు అవుతాయంటూ మెలిక వేసింది. తాజాగా ఇప్పుడు తిరుమలలోని పురావస్తు కట్టడాలు మాయం అవుతున్నాయంటూ కొందరు రాసిన రహస్య లేఖపై కేంద్రం కదిలింది. అయితే సమయం సందర్భం లేకుండా సాగిన ఈ వ్యవహారం బెడిసికొట్టింది.