ముద్రగడ లేకుండా ఆ "ముద్ర" సాధ్యమయ్యేనా?

ముద్రగడకు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజికవర్గంలో అభిమానులున్నారు. ఆయన లేకుండా ఐక్యత సాధ్యం కాదంటున్నారు

Update: 2022-01-24 04:26 GMT

ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం బలమైనది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయాలను శాసించే స్థాయిలో ఉంది. అత్యధిక ఓటర్లున్న సామాజికవర్గం కావడంతో ఏ రాజకీయ పార్టీ అయినా కాపులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అది జగన్ అయినా, చంద్రబాబు అయినా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కాపులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అయితే ఇటీవల కాపు నేతలందరూ సమావేశమై టీడీపీ, వైసీపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని కాపునేతలంతా ఒక్కటయ్యారు.

భవిష్యత్ కార్యాచరణపై....
వివిధ పార్టీలో ఉన్న నేతలంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. ఇందులో గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, జేడీ లక్ష్మీనారాయణ వంటి నేతలు కలిశారు. కానీ కాపు సామాజికవర్గం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ముద్రగడ పద్మనాభం. ఆయన తాను సొంతంగా బీసీలతో కలసి కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రికి, ప్రధానికి, బీసీలు, దళితులకు లేఖలు రాస్తూ ఆ దిశగా ఆయన బిజీగా ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా....
ముద్రగడకు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజికవర్గంలో అభిమానులున్నారు. ఆయన స్వభావం, కాపుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు ఆయనకు ఆ పేరును తెచ్చి పెట్టాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గంలో ఆయనకు తిరుగులేదు. అటువంటి ముద్రగడను కలుపుకుని వెళ్లకుండా గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు ఏర్పాటు చేసే కూటమికి కాపు సామాజికవర్గం నుంచి మద్దతు లభిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నే.
కలుపుకుని వెళ్లాలని....
ఎందుకంటే గంటా శ్రీనివాసరావును కాపు సామాజికవర్గం నేత కంటే ఒక పారిశ్రామికవేత్తగా, రాజకీయనేతగానే చూస్తారు. ఆయన వల్ల తమ సామాజికవర్గానికి ఒనగూరిందేమీ లేదని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు తమను ఎప్పుడూ పట్టించుకోలేదన్న భావన కాపు నేతల్లో ఉంది. అందుకోసమే ముద్రగడను కలుపుకుని వెళ్లాలన్న యోచనలో గంటా బ్యాచ్ ఉన్నట్లు తెలిసింది. అయితే ముద్రగడ అందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
వచ్చే నెల రెండో వారంలో....
అయితే నిన్న కాపు నేతలంతా జూమ్ కాన్ఫరెన్స్ లో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విజయాడలో వచ్చే నెల రెండో వారంలో మరోసారి ప్రత్యక్షంగా సమావేశం కావాలని నిర్ణయించారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కాపులు అస్థిత్వం కోల్పోయేలా రాష్ట్రంలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సమావేశంలో ఆందోళన వ్యక్తమమయింది. పార్టీలకు అతీతంగా ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్, బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఐఏఎస్ అధికారులు రామ్మోహన్, భాను, మాజీ ఐపీఎస్ సాంబశివరావులు హాజరయ్యారు.


Tags:    

Similar News