Summer Effect : ఏసీలు ఆన్ చేయండి.. ఇక ఫ్యాన్ లు ఫుల్ లో పెట్టుకోవాల్సిందే

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిపోయింది

Update: 2025-02-06 04:25 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిపోయింది. ఉదయం ఎనిమిది నుంచి భానుడు భగభగమంటున్నాడు. బయటకు వెళితే సెగలు తప్పడం లేదు. ఇంట్లో ఉన్నవారు సయితం ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నారు. నిన్నటి వరకూ చలిగాలులతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఏసీలు ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏసీలు సర్వీసింగ్ ఇవ్వడం ప్రారంభమయింది. వేడిగాలుల తీవ్రత పెరగిపోవడంతో పాటు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి నమోదు అవుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు.

36 డిగ్రీలకు చేరిన...
ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఎండవేడిమి దెబ్బకు ఉదయం వేళ వ్యాపారాలు బోసి పోయి కనిపిస్తున్నాయి. సాయంత్రం నుంచే తమ వ్యాపారాలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, కొత్తగూడెం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో 36 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి మరింత ఎండలు వస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.
మరో పది హేను రోజులు...
ఎండల తీవ్రత మరో పదిహేను రోజుల పాటు అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జ్వరం, వైరల్ ఫీవర్ తో పాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప ఉదయం వేళ బయటకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాల రోగాలతో బాధపడే వారు బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఇలా ఎండలు దంచేస్తుంటే ఇక మే నెలలో ఎలా ఉంటాయన్న ఆందోళన ప్రజలకు నిద్రలేకుండా చేస్తుంది.


Tags:    

Similar News