పార్టీ మీడియాల తీరే వేరయా...!!

Update: 2018-10-23 03:30 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల మీడియాల తీరు చిత్రంగా నడుస్తుంది. సామాజిక మాధ్యమాలు విజృంభిస్తున్నా సంప్రదాయ మీడియా ల నడవడికలో ఎలాంటి మార్పులు ఉండటం లేకపోవడం చర్చనీయాంశంగా మారుతుంది. ఫలితంగా సోషల్ మీడియా వేదికలపై పార్టీ మీడియా లు నవ్వుల పాలౌతున్నాయి. అయినా ఆయా పార్టీల భజనలో ఏ ఒక్కరు వెనక్కి తగ్గడం లేదు. సరికదా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది మరింతగా వారి పార్టీల భావజాలాన్ని ప్రజల మీద అదే పనిగా రుద్దేస్తున్నాయి. ఈ ధోరణితో మీడియా విశ్వసనీయత మరింతగా దిగజారుతూ వస్తుంది.

ఒక విమర్శ పదిమంది ప్రతి విమర్శలు ....

ఒకరు విమర్శిస్తే వారికి ధాటిగా ప్రతి సమాధానం ఇచ్చిన మరొకర్ని చూపించడం మీడియా లో రివాజు. లేదా విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి లేదా వారికి సంబంధించిన వారు జవాబు చెప్పడం అది మీడియా లో చూపించడం రొటీన్ గా జరిగే అంశం. కానీ తెలుగు రాష్ట్రాల మీడియా ధోరణి మరీ పైత్యప్రకోపితం గా మారింది. అదెలా అంటే ఒకరు ఆరోపణ చేయగానే ఆయా పార్టీల మీడియాలు తమ పార్టీకి చెందిన పదిమంది వ్యాఖ్యలు ప్రసారం చేస్తూ అదే నిజమని భ్రమింప చేసే పనిలో వుంటున్నారు.

టీఆర్పీ రేటింగ్స్ తగ్గి.....

కానీ సోషల్ మీడియా లో వీరి పప్పులు ఉడకడం లేదు. నెటిజెన్లు స్వేచ్ఛగా జరుగుతున్న భాగోతాలు ఉతికి ఆరేస్తున్నారు. ఇప్పటికే టిఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయి యూట్యూబ్ పై పూర్తిగా ఆధారపడిన సంప్రదాయ డిజిటల్ మీడియా ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికలకు పూర్తిగా తమ సిగ్గును వదిలేసేలా రూపాంతరం చెందుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Similar News