తెలుగుదేశం పార్టీతో పొత్తుతో వెళ్లాలా? లేక ఇతర పార్టీలతో కలసి వెళ్లాలా? ఇదే చర్చ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. తెలుగుదేశంతో పొత్తు ఉండాలని ఒక వర్గం, వద్దంటూ మరో వర్గం గట్టిగా పట్టుబడుతోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పొత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో టీడీపీతో పొత్తుతో వెళ్లేందుకే ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను ఎదుర్కొనాలంటే పొత్తులు అవసరమని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రొఫెసర్ కోదండరామ్ తో ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. కోదండరామ్ పార్టీ విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి నష్టపోక తప్పదని భావించిన కాంగ్రెస్ కొన్ని సీట్లను త్యాగం చేసుకునైనా కేసీఆర్ ను ఢీకొట్టాలని నిర్ణయించింది.
సెటిలర్ల ఓట్ల కోసమేనా?
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇప్పటికీ బలమైన క్యాడర్ఉంది. ఓటు బ్యాంకు కూడా ఉంది. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు టీడీపీకి అనుకూలంగా ఉంటాయని భావిస్తుండటంతో వీరి ప్రభావం నాలుగైదు జిల్లాల్లో ఉండనుంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కలిస్తే రెండింటికీ లాభమే. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పాత్తుకు సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో టీడీపీతో పొత్తు కారణంగా ఎక్కువ సీట్లు త్యాగం చేయాల్సి రావచ్చు. అందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడాల్సి ఉంటుంది.
ఒక వర్గం కాదంటున్నా.....
అయితే కాంగ్రెస్ లోని ఒకవర్గం దీన్ని వ్యతిరేకిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుకూలంగా ఉన్న ఈ వర్గం టీడీపీతో పొత్తుకు వెళ్లడం వేస్ట్ అని ఇప్పటికే అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అధిష్టానం పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో పొత్తు టాపిక్ గాంధీభవన్ లో ఎక్కువగా నడుస్తోంది. కాని చివరకు నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుంది. రాహుల్ టీం అన్ని రాష్ట్రాల్లో పొత్తులపై ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. మాజీ కేంద్రమంత్రి చిదంబరం పొత్తులు 12 రాష్ట్రాల్లో అవసరం లేదని చెప్పినప్పటికీ అందులో తెలంగాణ ఉందా? లేదా? అన్నది తెలియరాలేదు.
కమిటీ యే అంతా.....
పొత్తుల కోసం త్వరలోనే పార్టీ అధిష్టానం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చించి పొత్తుపై ఒక నిర్ణయానికి వస్తారు. ఈ కమిటీయే సీట్ల పంపకం పై కూడా చర్చలు జరుపుతుంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు పొత్తు ఉండాలని ఇప్పటికీ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ తో కలసి వెళ్లాలని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వెళ్లకూడదని నిర్ణయించింది. మరి ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో పొత్తుపై క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు.