ఈ " విలక్షణ" వ్యవహారం ఎందుకో?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి పర్యటనలో ఉద్ధవ్ థాక్రేను కలిశారు. జాతీయ రాజకీయాల గురించి చర్చించారు.

Update: 2022-02-20 12:24 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి పర్యటనలో ఉద్ధవ్ థాక్రేను కలిశారు. జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. మోదీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు గురించి ఆయన మాట్లాడి ఉండవచ్చు. ఆ కూటమిలోకి ఎవరెవరు వచ్చే అవకాశం ఉన్నదీ ఆరా తీసి ఉండవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతుతో అధికారంలో కొనసాగుతున్న ఉద్దవ్ థాక్రే యూపీఏ కూటమిని వీడి వస్తారా? అని పెద్దాయన లోతుగా అడిగి ఉండవచ్చు. ఇవన్నీ మన ఊహలే. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నది తెలియదు.

ముంబయి పర్యటనలో...
కానీ కేసీఆర్ పర్యటనలో ఒకే ఒక ట్విస్ట్ మాత్రం చర్చకు దారితీసిందనే చెప్పాలి. ఆయనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన ముంబయికి వెళ్లిన కేసీఆర్ టీంలో ఎందుకు ఉన్నారో తెలియదు. ఆయనను కేసీఆర్ ఎందుకు అంత చేరదీస్తున్నారో అర్థం కాని విషయం. ప్రకాష్ రాజ్ తొలి నుంచి మోదీని విమర్శించే ట్వీట్లు చేస్తూ రాజకీయ నేతగా ఎదగాలన్న ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు రాజకీయాలు అచ్చి రాలేదనే చెప్పాలి.
గతంలో దేవెగౌడను...
కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజ్ గతంలో దేవెగౌడ ను కేసీఆర్ కలిసినప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు అంటే అది కన్నడ రాష్ట్రం. ఆయన సొంత ప్రాంతం కావడంతో కేసీఆర్ కు ఉపయోగపడతాడని భావించవచ్చు. ముంబయికి వెళ్లిన కేసీఆర్ బృందంలో ఆయన కుమార్తె కవిత, ఎంపీ బీబీ పాటిల్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సంతోష్ కుమార్ లు ఉన్నారు. వీరంతా రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నవారే. ప్రకాష్ రాజ్ ఈ బృందంలోకి ఎలా వచ్చి పడ్డాడన్నది అర్థంకాని విషయం.
రాజకీయంగా.....
ఎందుకంటే ప్రకాష్ రాజ్ గత ఎన్నికల్లో కర్ణాటకలో పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో బరిలోకి దిగి మెగా ఫ్యామిలీ అండ ఉన్నా గెలవలేకపోయారు. ఆయన రాజకీయాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. సామాజిక అంశాలపైనే ఆయన స్పందిస్తారు. అలాంటి ప్రకాష్ రాజ్ ను కేసీఆర్ ఎందుకు వెంట పెట్టుకుని తీసుకెళ్లారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయన వల్ల రాజకీయంగా కేసీఆర్ కు కలిగే లాభమేంటి? అని గులాబీ పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేసీఆర్ శరద్ పవార్ తో భేటీ అయ్యారు.


Tags:    

Similar News