గత పార్లమెంట్ సెషన్ చివరిలో ప్రవేశ పెట్టబడిన ఎపి రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఆమోదం పూర్తి రాజ్యాంగ విరుద్ధం అన్నది నాడు కాంగ్రెస్ నుంచి బహిష్కృతులైన ఉండవల్లి అరుణ కుమార్ వంటి వారి వాదన. మెజారిటీ లేకుండా కాంగ్రెస్, బిజెపిలు కలిసి ఏపీని విడతీసిన తీరుపై చర్చ జరగాలన్నది ప్రజల అభిమతం. అదే జరిగితే మరోసారి రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియలను పార్లమెంట్ భవిష్యత్తులో చేపట్టకుండా అధికార పక్షాలు జాగర్త పడేవి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా డివిజన్ అని చెప్పి స్పీకర్ నాడు తలలు కూడా లెక్క పెట్టకుండా బిల్లు ను ఆమోదించేశామని ప్రకటించేశారు. ఎలాంటి చర్చ జరక్కుండా 20 నిమిషాల్లో దేశంలో ఒక ప్రధాన రాష్ట్రాన్ని విభజించిన తీరు ప్రజాస్వామ్య వాదులను కలవరపాటుకు గురిచేసింది. రాజ్యాంగంపై అఘాయిత్యం చేసిన నాటి ఘటనకు బాధ్యులు ఆనాటి అధికారంలోని కాంగ్రెస్, విపక్షంలోని బిజెపి. ఆ రెండు పార్టీలను అప్పటి దుర్మార్గాన్ని ప్రశ్నించే అరుదైన అవకాశం అవిశ్వాసం రూపంలో టిడిపి కి దక్కినా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోయింది.
తలుపులు మూశారు కెమెరాలు కట్ చేశారు వరకు వెళ్లారంతే ...
రాజ్యాంగ విరుద్ధంగా యుపిఎ హయాంలో చేసిన ఎపి విభజన బిల్లు ఆమోదాన్ని టిడిపి ఎంపీలు సమర్ధవంతంగా ప్రస్తావించలేక పోయారు. తలుపులు మూసి, కెమెరాలు ఆపి 20 నిమిషాల్లో బిల్లు ఆమోదించేశారన్నారు కానీ అది చట్టవిరుద్ధంగా ఎందుకు చేయాలిసి వచ్చింది దానికి బాధ్యులపై చర్యలను డిమాండ్ చేయలేక పోయారు. సభలో మెజారిటీ లేకుండా ఓటింగ్ నిర్వహించకుండా రాజ్యాంగ విరుద్ధంగా ప్రజా స్వామ్యాన్ని ఎందుకు ఖుని చేశారని దీనికి భాధ్యులైన నాటి కాంగ్రెస్, బిజెపిలు వివరణ ఇవ్వాలని పట్టుబట్టలేకపోయారు. చేసిన తప్పుకు ఇద్దరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయలేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఒక పక్క టీఆరెస్ ఎంపీల నిరసనకు భయపడి తెలంగాణ లో రాజకీయ అవసరాలకోసం సభలో సాంకేతికంగా ఆమోదం పొందని ఏపీ రీ ఆర్గనైజేషన్ బిల్లుపై లోతుగా పోకుండా విభజన హామీల పై మాత్రమే చర్చను టిడిపి నడిపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విభజన హామీలు, స్పెషల్ స్టేటస్ కన్నా అసలు రాష్ట్ర విభజనే శాస్త్రీయంగా, సాంకేతికంగా రాజ్యాంగబద్ధంగా కాలేదన్న అంశం అందరు కలిసి ఎందుకు పాతిపెట్టారన్న చర్చ మరోసారి మొదలైంది.