ఆయనే టిడిపి ప్రధాన బ్యాట్స్ మెన్ ...?

Update: 2018-07-19 05:00 GMT

కేంద్రం పై అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు మాట్లాడతారు అన్న అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. సంఖ్యా బలాన్ని బట్టి టిడిపికి స్పీకర్ ఎంత సమయం కేటాయిస్తారు ? ఎందరిని అనుమతిస్తారు ? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. టిడిపి మాత్రం తమకు అరగంటైనా కేటాయించాలని స్పీకర్ ను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో అవిశ్వాసం నోటిస్ ఇచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు లను మాట్లాడించాలని ప్రస్తుతం భావిస్తుంది. ఒకవేళ పది పదిహేనునిమిషాలు మాత్రమే లభిస్తే ఎవర్ని రంగంలోకి దింపాలన్న సమాలోచనలు చేస్తుంది తెలుగుదేశం.

గల్లా వైపే అందరి చూపు ....

గతంలో లోక్ సభలో జరిగిన చర్చలో దుమ్ము రేపిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వైపే అందరి చూపు పడింది. చక్కటి వాగ్ధాటితో, సూటిగా సుత్తి లేకుండా పాయింట్ టూ పాయింట్ మాట్లాడి గల్లా తన సత్తా చాటి చెప్పారు. అప్పుడే ఆయన ప్రతిభ ఏపీతో పాటు దేశం మొత్తానికి తెలిసింది. ఈ నేపథ్యంలో టిడిపికి చర్చలో తక్కువ సమయం ఇస్తే గల్లా జయదేవ్ తో మాట్లాడిస్తేనే మంచిదన్న ఆలోచన మెజారిటీ పార్టీ వర్గాల నుంచి వినవస్తుంది. మాట్లాడే అవకాశం వుండే స్పీకర్లకు ఫైనల్ గా చంద్రబాబు కోచింగ్ ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. ఏపీకి జరిగిన అన్యాయం పై ఇప్పటికే మేధావులు, ఉన్నతాధికారులతో బాబు భేటీ అవుతూ వచ్చారు. లోక్ సభలో వైసిపి లేని పక్షంలో తమ పార్టీ సమర్ధంగా రాష్ట్ర ప్రయోజనాలపై వాదన వినిపించడం ద్వారా మొత్తం మైలేజ్ ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ఇప్పటికే పక్కా స్కెచ్ గీశారు. తదనుగుణంగా మాటలు తూటాల్లా వాడే వక్తలను తయారు చేసే పనిలో వున్నారు ఆయన.

Similar News