గోదావరి జిల్లాల్లో ఆపరేషన్ మొదలు పెట్టిన టీడీపీ ...

Update: 2018-07-04 17:00 GMT

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సర్దుబాట్లు, ఆపరేషన్ ఆకర్ష్ లు ఇలా అనేకం ఉంటాయి. ముఖ్యంగా సొంత పార్టీలో అందరినీ ఒకే గూటి కిందకు తేవడం అత్యంత క్లిష్టమైన పనే. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో సమకాలీకుడైన ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తికి తూర్పులో పార్టీని సెట్ చేసే బాధ్యతను అధినేత అప్పగించినట్లు పార్టీవర్గాల సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో వున్న గ్రూప్ తగాదాలను పరిశీలించడంతో పాటు వైసిపి, జనసేన ప్రభావాన్ని అంచనా వేసి వాటికి ధీటుగా పార్టీ వ్యూహాన్ని తయారు చేసేందుకు కేఈ రంగంలోకి దిగారు. వైసిపి అధినేత జగన్ పాదయాత్రకు తూర్పు గోదావరి జిల్లాలో ఊహించిన దానికన్నా విశేష స్పందన రావడంతో టిడిపి క్షేత్ర స్థాయిలో వున్న బలాన్ని అంచనా వేస్తుంది. రాబోయే కీలక ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా ఎలా ముందుకు వెళ్లాలనేది పసుపు తమ్ముళ్ళ ఆలోచన.

పశ్చిమాన చంద్రబాబు తూర్పున కేఈ ...

అధికార పీఠాన్ని అందుకోవాలంటే గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించాలి. ఒక పక్క పవన్ ప్రభావంతో గోదావరి జిల్లాలో పార్టీకి గట్టి దెబ్బ తగలనున్న నేపథ్యంలో టిడిపి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి తోడు సంప్రదాయానికి భిన్నంగా వైసిపి అధినేత రాజమండ్రి పార్లమెంట్ స్థానం ఈసారి బీసీకే కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో టిడిపి ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతోంది. పార్టీలు ఏవైనప్పటికీ కమ్మ సామాజికవర్గాన్ని ఆదరించే నియోజకవర్గాన్ని వదులుకోవడం టీడీపీకి కష్టసాధ్యమయ్యే పరిస్థితి. సిట్టింగ్ ఎంపి మురళీమోహన్ ను మార్చాలని అధిష్టానం భావించినా తిరిగి అదే సామాజికవర్గం లో ఒకరికి టికెట్ ఇవ్వక తప్పదు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో అధినేత చంద్రబాబు పర్యటిస్తే తూర్పు గోదావరిలో సీనియర్ నేత కేఈ కృష్ణ మూర్తి సీన్ లోకి దిగారు.

సుడిగాలి పర్యటన చేసిన కేఈ ...

కేఈ అధికారిక పర్యటనగా పైకి చెప్పినా ఆయన పర్యటన వెనుక అసలు ఉద్దేశ్యం వేరన్నది పరిశీలకుల అంచనా. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వం తరపున పాల్గొని, పార్టీ శ్రేణులతో, ముఖ్యనేతలతో రోజంతా గడిపారు. జనసేన రంగప్రవేశంతో అటు వైసీపీ, ఇటు టీడీపీ బీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడలతోనే ముందుకు వెళుతున్నాయి. టీడీపీకి జిల్లాకు చెందిన మరో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఉన్నప్పటికీ ఆయన సామాజిక వర్గం ఆయనతో లేరు. గతంలో ప్రజారాజ్యం వైపు కాపు సామాజికవర్గం మొగ్గుచూపినట్లే ఈసారి జనసేన వైపు గోదావరి జిల్లాలలో ఆ సామాజికవర్గం మొగ్గు చూపుతుంది. ఈ పరిస్థితుల్లోనే ఇకపై కూడా గౌడ, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన టిడిపి నేతలు విస్తృతంగా గోదావరి జిల్లాల బాట పట్టనున్నారు. జగన్ సైతం పిల్లిసుభాష్ చంద్రబోస్ వంటి నేతలనే ఫ్రంట్ లైన్లో వినియోగిస్తున్నారు.

Similar News