అసలే క్లిష్ట సమయం...ఆపై...పార్టీ నేతలు

Update: 2018-03-31 11:30 GMT

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజునే అసమ్మతి ఆ పార్టీలో భగ్గుమనడం పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. చంద్రబాబు ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు. ఒకవైపు కేంద్రం మరోవైపు జగన్, పవన్ కల్యాణ్ లు విరుచుకుపడుతుండటం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు అందకపోవడం, కేంద్రం ఏదో చేస్తుందన్న సమాచారంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమయంలో పార్టీలో ఐక్యతను పాటించాల్సిన తెలుగుతమ్ముళ్లు వీధిన పడటం అధినాయకుడినే ఆశ్చర్య పరుస్తోంది.

నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు....

ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలతో పాటుగా కొత్తగా మరికొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు చెలరేగడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే అల్లరి పాలయితే ప్రజలకు ఏం సంకేతాలు పంపుతారని, కార్యకర్తలను ఎలా డీల్ చేస్తారని ముఖ్యనేతలను ఆయన మందలించినట్లు తెలుస్తోంది. ఏపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుతో పాటు లోకేష్ కు కూడా చంద్రబాబు క్లాస్ పీకారు. పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజునే రగడ చేయడం మంచి పద్ధతి కాదని, బ్లాక్ మెయిలింగ్ చేస్తే తాను తొలొగ్గుతాని అనుకుంటే అది వారి పొరపాటేనని గ్రహించాలని చంద్రబాబు కళా వెంకట్రావు చేత రగడ చేసిన నేతలకు సమాచారం పంపించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

బ్లాక్ మెయిలింగ్ కు లొంగనన్న.....

ఏదైనా సమస్య ఉంటే అమరావతికి వచ్చి మాట్లాడుకోవాలి గాని జిల్లాల్లో రగడ చేస్తే సహించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి వైఖరిపై సీఎం చంద్రబాబు మండిపడినట్లు సమాచారం. తాను అఖిలప్రియకు ఇప్పటికే సర్ది చెప్పానని, మనస్పర్థలుంటే సర్దుకు పోయి తన వద్దకు రావాలి గాని, ఇలా బజారుకెక్కితే పార్టీ పరువు ఏం కావాలని ఆయన జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులును నిలదీసినట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి వ్యతరేకంగా సమావేశాలు పెట్టడంపై మాజీ ఎంపీ సైఫుల్లా పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

సెటిల్ చేస్తామని చెప్పి....

రాష్ట్ర పరిస్థితి బాగా లేకపోవడం, ముప్పేట దాడి తనపై జరుగుతుండటంతో దీన్నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆయన వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఈనేపథ్యంలో పార్టీలో జరుగుతున్న గొడవలు, ఘర్షణలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్ ఛార్జి మంత్రులు ఇక ఎందుకు ఉన్నట్లు ఆయన ఫైరయ్యారు. ప్రతి చిన్న విషయాన్నీ తాను పరిశీలించాలంటే కుదరదని ఆయన తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఆగ్రహం చూసిన నేతలు తాము సెటిల్ చేస్తామని ఆయనను శాంతింప చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు బహిర్గతమవ్వడంతో చంద్రబాబు తప్ప ఎవరు డీల్ చేసినా అది సెటిల్ కాదని కొందరు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Similar News