పుట్టాకు టిక్కెట్ డౌటేనా?

మైదుకూరు నియోజకవర్గం టిక్కెట్ ఈసారి పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా లేరు

Update: 2023-01-07 07:11 GMT

మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా ట్రాక్ రికార్డు లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీ విజయం సాధించింది. అంటే దీనిని బట్టి అక్కడ ఎంత బలహీనంగా ఉందో చూసుకోవచ్చు. 1985, 1999లో రెండు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ రెండుసార్లు శెట్టిపల్లి రఘురామిరెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. ఆయనే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రెండు సార్లు గెలిచిన టీడీపీ ఇక ఎప్పుడూ గెలుపు పిలుపు అందుకోలేకపోయింది.


రెండు సార్లు ఓడి...

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా అక్కడ మాత్రం గెలవలేకపోయింది. 2014, 2019లో మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పుట్టా సుధాకర్ యాదవ్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు వియ్యంకుడు. రెండుసార్లు ఓటమి పాలయినా ఆయననే మైదుకూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించారు. మరోవైపు సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో అసంతృప్త నేతగా కొనసాగుతున్నారు. ఆయన టీడీపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీఎల్ కు కూడా టిక్కెట్ ఇచ్చే ఆలోచన చంద్రబాబుకు లేదు.
ప్రత్యామ్నాయ నేత కోసం...
అందుకే పుట్టా సుధాకర్ యాదవ్, డీఎల్ రవీంద్రారెడ్డికి కాకుండా మరో యువకుడి కోసం మైదుకూరులో వెదుకుతున్నారని తెలిసింది. కొత్త వ్యక్తి అయితే ప్రస్తుత ఎమ్మెల్యే శెట్టిపల్లిని ఎదుర్కొనగలరన్న నివేదికలు చంద్రబాబుకు అందాయి. దీంతో పాటు యువకులకు ఈసారి నలభై శాతం టిక్కెట్లు ఇవ్వాలన్నది కూడా పుట్టాకు ఇవ్వకపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. దీంతో పాటు పుట్టా సుధాకర్ యాదవ్ కు మరో అడ్డంకి ఉంది. అదే ఆయన కుమారుడు పుట్టా మహేష్ యాదవ్ ను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

పట్టా కుటుంబానికి ఎంపీ టిక్కెట్...
నరసరావుపేట పార్లమెంటు నుంచి దాదాపు పుట్టా మహేష్ యాదవ్ పోటీ ఖాయమయిందని పార్టీ వర్గాల ద్వారా అందతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రాయపాటి కుటుంబం దాదాపు పార్టీకి దూరమయింది. దీంతో నరసరావుపేటలో పుట్టా మహేష్ ను బరిలోకి దింపాలన్న యోచనలో ఉన్నారు. ఆ నియోజకవర్గం పరిధిలో యాదవ సామాజికవర్గం ఎక్కువ. దీంతో పాటు కమ్మ సామాజికవర్గం ఓట్లు కలిస్తే గెలుపు సులువవుతుందన్నది చంద్రబాబు వ్యూహం. అందుకే పుట్టా మహేష్ యాదవ్ టిక్కెట్ దాదాపు ఖరారయినట్లేనని అంటున్నారు. అంతేకాకుండా యనమల అల్లుడు కూడా కావడం ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. ఒక ఇంట్లో ఒకే టిక్కెట్ పుట్టా ఇంట్లో కూడా వర్తిస్తుండటంతో మైదుకూరు టిక్కెట్ మరొకరికి ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు.


Tags:    

Similar News