ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆరాధ్యదైవం శ్రీనివాసుని సన్నిధిలో ఏం జరుగుతుంది. స్వామి వారి సంపద దొంగలపాలు అవుతుందా ? విలువైన వజ్రాభరణాలు కొన్ని లెక్కల్లోనే లేకుండా మాయం అయితే మరికొన్ని లెక్కల్లో వున్నా లేనట్లేనా ? ఈ అనుమానాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యక్తం చేసిన అనుమానాలు, ఆరోపణలు, విమర్శలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైసూరు మహారాజులు సమర్పించిన ప్లాటినం హారంలోని గులాబీ వజ్రం ఏమైందన్నది ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తుంది. ఈ వజ్రం లాంటిదే ఇటీవల జెనీవాలో కోట్ల రూపాయల ధరకు అమ్ముడు అయ్యిందని ఇది స్వామీ వారిదేనేమో అని రమణ దీక్షితులు చేసిన అభియోగం మొత్తం టిటిడి పాలకమండలి, అధికార యంత్రాంగాల్లో గుబులు పుట్టించింది.
రంగంలోకి అనిల్ సింఘాల్ ...
తిరుమల శ్రీనివాసుని ఆభరణాలపై రేగిన రచ్చ నివారణకు టిటిడి ఈవో అనిల్ సింఘాల్ రంగంలోకి దిగాలిసి వచ్చింది. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలను ఈవో తీవ్రంగా ఖండించారు. తమ పాలనలో మాయం అయ్యే ఆభరణాలకు తాము బాధ్యత వహిస్తామని అంతకుముందు వాటికి అప్పుడు వున్న వారిదే బాధ్యత అంటూ ఆయన చేసిన ప్రకటన రాజకీయ దుమారాన్ని రేపనుంది. టిటిడిలో సాగుతున్న బాగోతాలపై ఒక వేళ కేంద్రం స్పందించి విచారణ జరిపిస్తే అవకతవకలన్నీ గతంలో జరిగినవే అని నెట్టుకొచ్చే వ్యూహాన్ని సింఘాల్ తెలివిగా ఉపయోగించారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
చిల్లర నాణెంతో కొడితే ...?
ఇక గులాబీ వజ్రం స్వామి ఊరేగింపులో భక్తులు విసిరిన చిల్లర నాణేలతో ముక్కలు అయినట్లు వున్న ఫోటోను సింఘాల్ విడుదల చేశారు. ఇది ఎలా ముక్కలు అవుతుందని వజ్రాన్ని వజ్రంతో కోయగలమని సుత్తితో కూడా పగలని వజ్రం చిల్లర నాణేలతో ఎలా మిగులుతుందని దీక్షితులు వ్యక్తం చేసిన అనుమానాలనే భక్తులు వ్యక్తం చేస్తున్నారు. అది వజ్రం అని రమణ దీక్షితులు చెబుతుంటే కెంపుగా టిటిడి వెల్లడిస్తుంది. ఇక గులాబీ వజ్రం నిజంగా ముక్కలు అయితే వేలమంది ఊరేగింపులో చెల్లా చెదురుగా పడే ముక్కలు టిటిడి వారు ఎలా ఏరి దాచిపెట్టారన్న సందేహాలు మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన ఈ వ్యవహారంపై రమణ దీక్షితులు చెప్పినట్లు సిబిఐ విచారణ జరపాలన్నది భక్తుల డిమాండ్. అయితే దీనికి అటు టిటిడి పాలకమండలి, సర్కార్ సిద్ధంగా మాత్రం లేవంటున్నారు అంతా. విమర్శలు ఆరోపణలతో గోవిందుడి పుణ్యక్షేత్రం ఇప్పుడు వివాదాస్పదం కావడం భక్తుల్ని వేదనకు గురిచేస్తుంది.