విద్య వ్యాపారం అయ్యాక ప్రతి అంశం వివాదాస్పదంగా తయారౌతుంది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రతి అంశం చర్చనీయాంశంగానే మారుతోంది. ముఖ్యంగా చైతన్య, నారాయణ గత ఏడాదిగా ఒకరి గుట్టు మరొకరు విప్పుకుంటూ విద్యా వ్యాపారంలో ఇన్ని దారుణాలా అని అంతా అవాక్కయేలా తమ చర్యల ద్వారా చాటిచెబుతున్నాయి. తాజాగా విడుదలైన పదోతరగతి ఫలితాల ర్యాంక్ లు మరోసారి దిగ్గజ కార్పొరేట్ విద్యా సంస్థల నడుమ కొత్త చిచ్చు తెచ్చి పెట్టాయి. తమ ర్యాంకర్లను నారాయణ పట్టుకుపోయిందంటూ ఇప్పుడు చైతన్య విద్యాసంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై న్యాయపోరాటానికి దిగుతామంటూ హెచ్చరిస్తున్నాయి.
అసలేం జరుగుతుంది....?
ప్రతి కుటుంబం తమ రూపాయి సంపాదనలో సగం పిల్లల ఉత్తమ చదువు కోసం ఖర్చు చేస్తున్నారు. స్తోమత వున్నా లేకపోయినా నారాయణ, చైతన్య విద్య సంస్థలలో పిల్లలను అప్పులు చేసి మరి చదివించడం స్టేటస్ సింబల్ గా మారింది. కొందరు అందులో చదివితేనే తమ పిల్లలను చదివిస్తున్నట్లు భావించే విష సంస్కృతి పెరిగి పెద్దదైపోయింది. ఫలితంగా వేలకోట్ల విద్యా వ్యాపారం నిబంధనలను తుంగలోకి తొక్కి యథేచ్ఛగా సాగిపోతుంది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో రుబ్బురోలు చదువుల కారణంగా అంతా అద్భుత రీతిలో మార్కులు తెచ్చుకుని తల్లితండ్రులకు డబ్బు పోయినా ఆనందం మిగులుస్తున్నారు. ప్రాధమిక విద్య పూర్తి అయ్యాక ఇంటర్ కోసం తల్లితండ్రులు తమ పిల్లలను తిరిగి నారాయణ, చైతన్య విద్య సంస్థల్లోనే చచ్చి చెడి జాయిన్ చేస్తున్నారు. అక్కడ జేఈఈ మెయిన్స్, మెడిసిన్ క్వాలిఫైయింగ్ శిక్షణ ను తాలిబాన్ తరహా ట్రైనింగ్ లో ఇచ్చేస్తున్నాయి విద్యా సంస్థలు. స్కూల్ విద్య నుంచి, ఇంటర్ వరకు అధిక సంఖ్యలో అడ్మిషన్స్ జరగాలంటే అనుకున్న టార్గెట్ ప్రకారం ర్యాంక్ ల పంట ఆ విద్య సంస్థలకే దక్కాలి. అక్కడే రెండు దిగ్గజ సంస్థల నడుమ యుద్ధం మొదలౌతుంది.
ర్యాంక్ ల నుంచి ...
ఈ రెండు విద్యా సంస్థలు గత ఏడాది తమ విద్యార్థులను కిడ్నాప్ చేశారంటూ.. తమ వారిని అవతలి వారు చేశారంటూ రోడ్డెక్కి కేసులు సైతం ఒకరిపై మరొకరు పెట్టుకున్నారు. ఇక నారాయణ లో జరిగేది అంతా నారాయణ నారాయణ అంటూ శ్రీ చైతన్య అందులో సిబ్బంది ఆడియో టేప్ లు రిలీజ్ చేసింది. ప్రతిగా నారాయణ చైతన్య బాగోతాలు కొన్ని బయటపెట్టింది. ఆ తరువాత సద్దుమణిగినట్లే అనిపించినా ఈ వివాదం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూ వచ్చి ఇప్పుడు తాజాగా మరోసారి రోడ్డున పడింది. తమ ర్యాంకర్లకు నారాయణ వలవిసిరిందంటూ శ్రీ చైతన్య ఆందోళన వెలిబుచ్చింది. అంతే కాదు న్యాయపోరాటానికి దిగుతామంటూ ప్రకటించింది. దాంతో ఇద్దరిమధ్య పాత తగాదా మరోసారి తెరపైకి వచ్చేసింది. విద్యా మాఫియా గా మారిన ఈ రెండు కార్పొరేట్ దిగ్గజాలు తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా శాసించే స్థాయికి ఎదిగాయి. ఈ నేపథ్యంలో వీరిలో ఎవరు తప్పు చేసినా ఆ అక్రమ కార్యకలాపాలు అరికట్టే నాధులే లేకుండా పోయారు.
పేరుకే చట్టాలు ...
వాస్తవానికి ఇంటర్ విద్యకు ఫీజు 2500 మాత్రమే చెల్లించాలని ప్రభుత్వ నిబంధనలు వున్నాయి. కానీ వేలరూపాయల నుంచి లక్షల్లో ఫీజులను కార్పొరేట్ కళాశాలలు వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తరగతుల నిర్వహణ. తీవ్ర వత్తిడితో కూడిన శిక్షణ విధ్యార్థులనేకమంది ఆత్మహత్యలకు పురిగొల్పే విద్యా విధానం నిర్లజ్జగా సాగిపోతుంది. విద్యార్థులకు ఆటలు వుండవు. ఆదివారాలు కూడా ప్రత్యేక తరగతులు నడుస్తాయి. గతంలో ఈ నారాయణ లో విద్యార్థులు సెలవులు ఇవ్వడంలేదని తమ విద్య సంస్థ పైనే దాడికి పాల్పడిన సందర్భం అందరికి తెలిసిందే. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చూసి చూడనట్లే ఈ కార్పొరేట్ సంస్థలకు సర్వ హక్కులు అప్పగించాయి. దాంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా మారిపోయింది. తల్లితండ్రులు తమ పిల్లల భవితకు వుండే బలహీనతే వీరి పెట్టుబడిగా మారి మార్కులు, ర్యాంకులనుంచి అన్ని వివాదాస్పదం అయ్యేలా వ్యవస్థ నడుస్తుంది. కంచె చేను మేసిన చందంగానే ఈ వ్యవస్థలు పరిరక్షించాలిసిన వారే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించడంతో కార్పొరేట్ వార్ ఇప్పట్లో చల్లారేలా అయితే కానరావడంలేదు.