సోనియా ను చేయిపట్టుకు లాగి ...!!

Update: 2018-08-11 02:30 GMT

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి పార్లమెంట్ ప్రాంగణంలో వింత అనుభవం ఎదురైంది. జెడ్ ప్లస్ క్యాటగిరిలో వుండే సోనియా రక్షణ వలయాన్ని సైతం ఛేదించి ఒక బృహన్నల ఆమె చేయి పట్టుకుని ఏపీకి న్యాయం చేయాలంటూ బతిమాలాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇంతపని చేసిందెవరో అందరికి తెలిసి పోయే ఉంటుంది. ఇంకెవరని సందేహం అవసరం లేదు విచిత్రవేషధారణల్లో ఆరితేరిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్.

న్యాయం చేస్తామన్న సోనియా ...

కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఏపీకి తాము తప్పక న్యాయం చేస్తామని సోనియా గాంధీ ఈ సందర్భంగా శివప్రసాద్ కి హామీ ఇచ్చారు. ఏపీకి బిజెపి అన్యాయం చేస్తుందంటూ శివప్రసాద్ పార్లమెంట్ లోనికి వెళుతుండగా చెయ్యి పట్టి ఆపేశారు. ఆ సమయంలో ఆయన బృహన్నల వేషధారణలో వున్నారు. సహజంగా నటుడు కావడంతో పార్లమెంట్లో నిరసన కార్యక్రమాల్లో శివప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వస్తున్నారు.

ఆసక్తిగా తిలకిస్తూ.....

తాజాగా సోనియా కూడా ఆయన వేషధారణను ఆసక్తిగా తిలకించారు. శివప్రసాద్ చెప్పినదంతా శ్రద్ధగా విన్నారు. ఈ సన్నివేశాన్ని దృశీకరించేందుకు మీడియా పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా సోనియా శివప్రసాద్ ను అభినందించారు. బీజేపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ రోజూ నిరసనలు తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలను సోనియా గాంధీ అభినందించారు. న్యాయం తప్పకుండా గెలుస్తుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా టీడీపీ ఎంపీలను అభినందించారు.

Similar News