ఈ సీఎంకు కలిసి రావడం లేదా?

Update: 2018-06-02 18:29 GMT

ఎన్నికలు జరుగుతున్న వేళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మళ్లీ రైతుల సమస్య తలెత్తింది. మధ్యప్రదేశ్ లో రెండురోజులుగా రైతులు ఆందోళనకు దగారు. రైతులు పది రోజుల సమ్మెను ప్రకటించారు. దీనికి గావ్ బంద్ అని నామకరణం చేశారు. రైతుల రుణాలను రద్దు చేయాలని, ఉచిత విద్యుత్తును అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న మధ్యప్రదేశ్ లో ప్రారంభమైన ఈ సమ్మె ఇతర రాష్ట్రాలకు విస్తరించడం విశేషం. పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు.

రైతుల ఆందోళనలతో.....

ఇప్పటికే కూరగాయలు, పాలసరఫరాను రైతులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో కూరగాయల కొరత ఏర్పడింది. పాలు దొరకడమూ కష్టంగా మారింది. పది రోజుల రైతుల సమ్మె ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్రాల్లో ఇబ్బందులు తప్పవని ప్రభుత్వాలు గ్రహించాయి. రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలకు సిద్ధమయినప్పటికీ తమ డిమాండ్లను అంగీకరిస్తేనే చర్చలకు వస్తామని రైతు సంఘ నేతలు తెగేసి చెబుతున్నారు. ఇటీవల నాసిక్ నుంచి ముంబయి వరకూ రైతులు పాదయాత్ర నిర్వహించి తమ డిమాండ్లపై ఆ ప్రభుత్వం నుంచి హామీ పొందారు.

పెరుగుతున్న ధరలు.....

ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో రైతులు సమ్మెబాట పట్టడంతో అక్కడి ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. గత కొద్దికాలం క్రితం మధ్యప్రదేశ్ లో రైతులు ఆందోళన చేస్తున్న సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో నలుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రైతులు ఆందోళన చేస్తున్నా సంయమనం పాటించాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే పాలు, కూరగాయలు నిలిచిపోయాయి. రైతులు తాము పండించిన పంటలను వీధుల్లోనే పారబోస్తూ నిరసనను తెలియజేస్తున్నారు. ఈసమ్మె పది రోజుల పాటు కొనసాగితే ధరలు పెరడగమే కాకుండా ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది తప్పదు. మరి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చేయనున్నారో చూడాలి. ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు సతమతమవుతున్న శివరాజ్ సింగ్ చౌహాన్ రైతుల సమ్మెతో మరింత ఇబ్బందుల్లో పడనున్నారు.

Similar News