స‌బ్బం హ‌రి స‌డెన్ యూట‌ర్న్ వెన‌క‌...ఇంత క‌థ ఉందా ?

Update: 2018-07-07 03:30 GMT

స‌బ్బం హ‌రి.. మాజీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ. అయితే, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీపై పోటీ చేస్తున్న స‌బ్బం హ‌రి ఒక్క‌సారిగా రూటు మార్చుకున్నారు. పార్టీకి రాంరాం చెప్పి.. బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న త్వ‌ర‌లోనే ఏదో ఒక పార్టీలో చేరి మ‌ళ్లీ ఎంపీగానో, కుదిరితే ఎమ్మెల్యేగానో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే, స‌బ్బం హ‌రి చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు నెటిజ‌న్లు కూడా అదే రేంజ్‌లో కామెంట్లు కుమ్ముతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. స‌బ్బం హ‌రి తాజాగా మీడియా ముందుకు వ‌చ్చాడు. వ‌చ్చీ రావ‌డంతోనే.. ‘జగన్‌, పవన్‌ బీజేపీ డైరెక్షన్‌లోనే పని చేస్తున్నారు' అని కామెంట్లు కుమ్మ‌రించాడు.

సబ్బం వ్యాఖ్యలు నమ్మొచ్చా...

వాస్త‌వానికి.. రాజ‌కీయ పార్టీల్లో అనేక చింత‌లు ఉంటాయి. అనేక ప‌రిస్థితులు ప్ర‌భావితం చేస్తుంటాయి. కానీ, స‌బ్బం హ‌రి మాత్రం సీనియ‌ర్ నేత అయి ఉండి కూడా .. బీజేపీ డైరెక్ష‌న్ అని చెప్ప‌డం దారుణంగా ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. పోనీ.. ఇక్క‌డ జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. త‌న‌పై సీబీఐ కేసులు, కోర్టు ఆంక్ష‌లు ఉన్నాయి కాబ‌ట్టి.. ఆయ‌న కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని అనుకోవ‌చ్చు.(టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్న దాని ప్ర‌కారం) మ‌రి ప‌వ‌న్‌కు ఏ అవ‌స‌రం ఉంద‌ని మోడీతో జ‌ట్టుకట్టి.. బీజేపీ డైరెక్‌ న్‌లో ప‌నిచేస్తున్నాడు? మ‌రి అలాంటి వాడైతే.. ఆయ‌న ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రాన్ని తూర్పార‌బ‌ట్టాడు క‌దా? జై ఆంధ్ర ఉద్య‌మాన్ని ఉటంకిస్తూ.. మాజీ కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడును ఉతికి ఆరేశాడు క‌దా? అప్పుడు లేని బీజేపీ భ‌క్తి ఇప్పుడు పొడుచుకు వ‌చ్చిందా?

గతంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా...

''కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ప‌వ‌న్‌, జ‌గ‌న్‌ లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేయవచ్చు’’ అని కూడా సబ్బం హరి చెప్పాడు. మ‌రి ఇదే విష‌యంలో(మ‌ద్ద‌తు ఇచ్చి పార్టీని అధికారంలోకి తెచ్చే విష‌యంలో) టీడీపీకి ప‌వ‌న్ మ‌ద్ద‌తిస్తే.,. త‌ప్పులేదా? అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. చంద్ర‌బాబు పాల‌న‌పై గ‌తంలో మీరే(స‌బ్బం హ‌రి) తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌న్న విష‌యాన్ని మ‌రిచిపోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వైసీపీలో చేరాలనుకున్నా...

వైసీపీలో రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి స‌హా.. రాజ్య‌స‌భ‌కు టికెట్ ఇస్తే.. పార్టీలో చేర‌తాన‌ని అనుచ‌రుల వ‌ద్ద చెప్పుకొన్న స‌బ్బం హ‌రి .. ఆ రెండూ ద‌క్క‌క పోయేసరికి ఏం చేయాలో తెలియ‌క‌.. పార్టీ విధానాల‌నే ప్ర‌శ్నించ‌డం, ఎంత మేర‌కు స‌మంజ‌స‌మ‌ని వైసీపీ వ‌ర్గాలు ఆయ‌న్ను ప్ర‌శ్నిస్తున్నాయి. ఇప్పుడు స‌బ్బం హ‌రి చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో ప‌నిచేస్తున్నార‌ని అనుకోవ‌చ్చా? అనేది వారి సూటి ప్రశ్న‌. త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్న నాయ‌కుడిగా.. స‌బ్బం హ‌రి..బాబు డైరెక్ష‌న్‌లోనే ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని భావించ‌వ‌చ్చా? అనేది వారి ప్ర‌ధాన సందేహం. మ‌రి త‌న‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌కు స‌బ్బం హ‌రి ఏం జ‌వాబు చెబుతారో చూడాలి.

సడన్ గా యూటర్న్ అందుకేనా..?

ఇదిలా ఉంటే పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై ఆస‌క్తిగా ఉన్న స‌బ్బం కొద్ది రోజుల క్రింద‌ట ముందుగా వైసీపీలోకి వెళితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీ త‌ర‌పున అన‌కాప‌ల్లి ఎంపీ సీటు నుంచి బ‌రిలోకి దిగితే ఎలా ఉంటుంద‌ని స‌న్నిహితుల‌తో చ‌ర్చించిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఆయ‌న స‌డెన్‌గా యూట‌ర్న్ తీసుకున్నారు. టీడీపీలో చేరితే అన‌కాప‌ల్లి ఎంపీ లేదా విశాఖ ఉత్త‌రం లేదా మాడుగుల నుంచి ఆయ‌న్ను అసెంబ్లీకి అయినా పోటీ చేయించే ప్లాన్‌లో టీడీపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టీడీపీ ఎంట్రీ ఎలా ఉన్నా..ఆయ‌న వ్యాఖ్య‌లు మాత్రం ఆ వైపుగానే ఆయ‌న ఉన్న‌ట్టు స్ప‌ష్టం చేస్తున్నాయి.

Similar News