మళ్ళీ రోహిత్ "హిట్"...!

Update: 2018-07-13 01:53 GMT

టీ ట్వంటీ సిరీస్ సాధించిన భారత్ ఇంగ్లాండ్ లో వన్డే సిరీస్ లోను అదే జోరు కొనసాగించి అభిమానుల మనసు దోచుకుంది. ఇంగ్లాండ్ లోని నాటింగ్ హమ్ లో జరిగిన తొలి వన్డే ను అలవోకగా గెలిచి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో శుభారంభం చేసేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ టి ట్వంటీలలో అందుకున్న ఫామ్ ను వన్డేలో కొనసాగించడంతో ఇంగ్లాండ్ టీం భీతిల్లిపోయింది. భీకరమైన తన ఫామ్ తో గ్రౌండ్ నలుచెరగులా కళ్ళు చెదిరే షాట్లు కొట్టి సెంచరీ (137 నాటౌట్ ) చేసిన రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ భారత్ గెలుపుకి బాటలు వేసాయి. కెప్టెన్ కోహ్లీ సైతం 75 పరుగులు సాధించడంతో 8 వికెట్ల తేడాతో గెలిచిన ఇండియా ప్రత్యర్థికి చుక్కలు చూపించింది.

బౌలర్ల విజృంభణతో ...

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ను భారత బౌలర్లు పూర్తిగా కట్టడి చేసినా సమిష్టి గా ఆడిన ఇంగ్లిష్ బ్యాట్సమెన్ 268 పరుగులకు ఆలౌట్ అయ్యి 269 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచారు. ఇంగ్లాండ్ బ్యాట్సమెన్ లో రాయ్ 38, బెయిన్ స్టోక్ 38, స్టాక్ 50, బట్లర్ 53, మొయిన్ ఆలీ 24,మోర్గాన్ 19 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో కుల్దీప్ 6 వికెట్లు, ఉమేష్ యాదవ్ 2, చాహల్ 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియన్ ఓపెనర్లు ధాటికి ఇంగ్లాండ్ బౌలింగ్ తేలిపోయింది. శిఖర్ ధావన్ 40 పరుగులు చేసి వెనుతిరిగినా రోహిత్ కి అండగా కెప్టెన్ విరాట్ కోహ్లీ (75) నిలవడంతో 40.1 ఓవర్లలోనే గెలుపు ముంగిట భారత్ నిలిచింది.

Similar News