వైసిపి నాయకురాలు, నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా నోటికి అడ్డు కట్ట వేసే ఒక్క నేత టిడిపి లో కానరావడం లేదు. తాజాగా దాచేపల్లి అత్యాచారం సంఘటనపై రోజా తన నోటికి పని చెప్పారు. ఆమె విమర్శలు ఆరోపణల ధాటికి టిడిపిలో ని మాటల మాంత్రికులు ఎవరు సరిపోవడం లేదు. హోం మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఎమ్యెల్సీ బుద్ధా వెంకన్న ఇక మంత్రులు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి ఇతర మహిళా నేతలు ఆమె నోటి ముందు బలాదూరే అవుతున్నారు. ఇంతమంది పై రోజా ఒక్కరై ధాటిగా ఎదుర్కొంటుంటే తెలుగుదేశం నేతలు ఆమె విసురుతున్న సవాళ్లు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక తడబడుతున్నారు.
టాపిక్ డైవర్ట్ చేసేలా ...
రోజా లేవనెత్తిన అంశాలకు నేరుగా సమాధానం చెప్పలేక పోతున్న టిడిపి నేతలు టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ ఆమె మందు కొట్టి ప్రెస్ మీట్స్ లో పాల్గొంటారని, ఆమెకు పరీక్షలు చేయాలని ఆమె చిత్రాలను, జబర్దస్త్ కార్యక్రమాలను అపహాస్యం చేస్తూ అసలు విషయం పై సమాధానాలు దాట వేస్తున్నారు. వాస్తవానికి జబర్దస్త్ కార్యక్రమం ఈటివి ప్రసారం చేస్తుంది. ఇక రోజా గతంలో వేసిన క్యారెక్టర్ లు లేక సినిమాల్లో ఆమె నటించే తీరు వృత్తిపరంగా చేసేవే. సాక్షాత్తు ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే ఆయన సినిమాల పరంగా ఆకుచాటు పిందె తడిచే అంటూ పాటలు పాడి తన మనవరాలి వయస్సు వారితో డ్యాన్స్ లు చేశారు. ఆ పాత్రలు వేరు రాజకీయాలు వేరు. మరి టిడిపి రోజా క్యారెక్టర్ డ్యామేజ్ కి రంగంలోకి దిగి ఆమె నోటికి బ్రేక్ వేయాలనే తీరులోనే రాజకీయం చేస్తుంది.
గత అనుభవాలనుంచి ...
రోజా ఏమి తక్కువ తినడం లేదు. టిడిపి మొత్తం పార్టీతో ఆమె ఒక్కరై మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. గతంలో అసెంబ్లీలో కానీ, నంద్యాల ఉపఎన్నికల్లో రోజా నోటిదురుసు వైసిపికి ప్లస్ కన్నా మైనస్ లే తెచ్చి పెట్టాయి. అయినా కానీ ఆమె ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. టిడిపి ముప్పేట దాడి చేస్తున్నా అంతకుమించి వారికి చుక్కలు చూపించే మాటలు తూటాలు వదిలేస్తున్నారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై దద్దమ్మ, చేతకాని వ్యక్తి, చేతులకు గాజులు అంటూ రోజా దుమ్ము దుకాణం చేసేస్తున్నారు. తమ అధినేతపై ఇలాంటి మాటల దాడి ని ఎలా తిప్పి కొట్టాలో తెలియక ఒకవైపు, తిరిగి రోజా ఇచ్చే కౌంటర్ ఎటాక్ కి భయపడి మరికొందరు, మహిళ కావడంతో తరువాత ఇబ్బందులు వస్తాయని మరికొందరు వెనక్కి తగ్గుతున్నారు. ఇక మహిళా టిడిపి నేతలు రోజా కు కౌంటర్ ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాంతో రోజా దూకుడు కు చెక్ పెట్టేవారే లేకుండా పోవడంతో బాటు వైసిపి లో సైతం ఆమె మాట్లాడే అభ్యంతరకర వ్యాఖ్యలు తప్పు అని చెప్పే వారు లేకుండా పోయారు. దీనికారణంగా అసలు వివాదం పక్కకు పోయి రోజా వ్యాఖ్యలు టిడిపి విమర్శలు అన్న అంశమే ప్రధాన చర్చగా మారిపోయింది.