కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి క్యాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ ఒక్క చలన చిత్ర పరిశ్రమలోనే కాదని, దేశవ్యాప్తంగా ప్రతి చోటా వేధింపులు ఉన్నాయని రేణుక వ్యాఖ్యానించారు. టాలివుడ్, బాలివుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై కొరియో గ్రాఫర్ సరోజ్ ఖాన్ వ్యక్తంచేసిన అభిప్రాయంపై రేణుక స్పందించారు. కేవలం చలనచిత్ర పరిశ్రమలోనే క్యాస్టింగ్ కౌచ్ లేదని, చట్ట సభల నుంచి అన్ని ప్రాంతాల్లో ఇది ఉందన్నారు. ఎన్ని చట్టాలు చేసినా వీటిని అరికట్టలేకపోతున్నామని రేణుక ఆవేదన వ్యక్తం చేశారు.
అంతా డ్రామాలే....
మహిళలపై అత్యాచారాలు, వేధింపులపై ప్రభుత్వాలు కూడా డ్రామాలు ఆడుతున్నాయని రేణుక అభిప్రాయపడ్డారు. వేధింపులకు పార్లమెంటు కూడా మినహాయింపు కాదని రేణుక సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఈ సమాజంలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఇక్కడి నుంచే పార్లమెంటుకు వస్తున్నారు. అందువల్ల పార్లమెంటు కూడా దీనికి మినహాయింపు కాదని రేణుకు ముక్తాయింపు నిచ్చారు. మహిళల రంగు, రూపాన్నే గుర్తిస్తున్నారని, తెలివి తేటలను గుర్తించడం లేదని రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మగ పిల్లలను సక్రమంగా పెంచాలని కూడా సలహా ఇచ్చారు.
ఎంతమందికి శిక్ష పడింది....?
చిన్నారులపై అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష విధించడం సబబేనన్న రేణుక.. అటువంటి ఘటనల్లో ఎంతమందికి శిక్ష పడిందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం రావాలని పిలుపునిచ్చారు. తప్పు జరిగిపోయిందని ఊరుకోకుండా మౌనం పాటించకుండా తిరగబడాలని మహిళలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు కూడా చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. చట్టం సక్రమంగా అమలు కాకుంటే వీటిని అరికట్టడం ఎవరి వల్లా కాదని ఆమె అభిప్రాయపడ్డారు. మనుషుల ప్రవర్తనలో మార్పు రావాలని, క్యాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పోరాడాలన్నారు రేణుక.