అఫ్గనిస్తాన్ కు చెందిన ఓ 19 ఏళ్ల కుర్రాడు మొన్నటి వరకు సన్ రైజర్స్ అభిమానులకు పరిచయమైన ఆటగాడు. మహా అంటే క్రికెట్ ని మరీ ఆరాధించేవారికి మాత్రమే తెలుసు. కానీ, శుక్రవారం నాటి కలకత్తా నైట్ రైడర్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ద్వారా అతడు ఇప్పుడు భారతదేశ క్రికెట్ అభిమానుల మనుసు దోచుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటి హైదరాబాద్ ను ఫైనల్ చేర్చాడు. దీంతో ఇప్పుడు రషీద్ ఖాన్ క్రికెట్ అభిమానులకు ఫేవరెట్ ప్లేయర్ గా మారిపోయాడు. ఈ సీజన్ లో స్పిన్ బౌలింగ్ తో మొదటి నుంచి సన్ రైజర్స్ కు బలాన్నిచ్చిన రఫీద్, నిన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ రాణించాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. ఎంతలా అంటే.. ఆ దేశ ప్రధానే స్వయంగా స్పందించి మా హీరో రషీద్ అనేంతలా. పలువురు భారత క్రికెట్ అభిమానులు ఏకంగా రషీద్ కు భారత పౌరసత్వం ఇవ్వాలనేంతలా.
విజయంలో రఫీద్ దే కీలకపాత్ర
శుక్రవారం నాటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 150 పరుగులు సాధించడమే ఎక్కువ అనుకున్నారు అంతా. కానీ, రషీద్ ఖాన్ కేవలం 10 బంతుల్లోనే 34 పరుగులు సాధించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రెండు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో కలకత్తా బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో హైదరాబాద్ 174 స్కోరు చేయగలిగింది. ఇక ధోని స్టైల్లో కొట్టిన హెలికాఫ్టర్ షాట్ అయితే సూపర్. చేజింగ్ లో ధీటుగా ఆడుతున్న కలకత్తాను రషీద్ బౌలింగ్ తో కోలుకోలేని దెబ్బ తీశాడు. నాలుగు ఓవర్లలో ప్రధాన బ్యాట్స్ మెన్లు రాబిన్ ఊతప్ప, క్రిస్ లీన్, ఆండ్రూ రస్సెల్ ల విక్కెట్లు తీసి కలకత్తా జట్టు వెన్నెముక విరిచాడు. దీనికి తోడు ఫీల్డింగ్ లోనూ రెండు క్యాచ్ లతో హైదరాబాద్ కి ఫైనల్ బెర్త్ పక్కా చేశాడు.
రషీద్ పై ప్రశంసల వర్షం
ఇప్పుడు రఫీద్ ఖాన్ పై క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రషీద్ ప్రపంచంలోనే అత్యున్నతమైన స్పిన్నర్ అని పేర్కొంటూ సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశాడు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న రషీద్ ఆ అవార్డును ఇటీవల తన స్వంత దేశం అఫ్గనిస్తాన్ లో క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన పేలుడులో మృతిచెందిన వారికి అంకితం చేశాడు. ఇక, ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టుకు రషీద్ అదనపు బలంగా కనిపిస్తున్నాడు.