తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ మాజీ ప్రధాన అర్చకులు మరోసారి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తిరుమలలో మలినమైన ప్రసాదాలు పెడుతున్నారన్నారు. తనను ఉద్యోగం నుంచి తప్పించే అధికారం టీటీడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తనకు టీటీడీ నోటీసులు జారీ చేసిందని, వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిందని చెప్పారు. అంటే స్వామి వారి పరువు వందకోట్లేనా అని ఆయన ఎద్దేవా చేశారు. తిరు ఆభరణాల లెక్కలను టీటీడీ చెప్పాల్సిందేనన్నారు. తాను చేసిన ఆరోపణలు తప్పని టీటీడీ నిరూపించుకోవాలన్నారు. తప్పులను ఎత్తిచూపితే ఉద్యోగం నుంచి తొలగిస్తారా? అని నిలదీశారు. తాను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేకనే టీటీడీ పరువు నష్టం దావా వేసిందన్నారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
నేలమాళిగలో మొహర్లు ఏవీ?
కలియుగంలో దైవమంటే భయం, భక్తీ రెండూ లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశత్వామా? అని రమణదీక్షితులు అన్నారు. 18 లక్షల స్వామి వారి బంగారు మొహర్లను నేల మాళిగలో భద్రపరిచారని, ఈ మాళిగకు వెళ్లాలంటే వంటశాల నుంచే వెళ్లాలని, అయితే డిసెంబర్ లో వంటశాలను మూసివేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు. మొత్తం మీద రమణదీక్షితులు మరోసారి ప్రభుత్వం, టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.